కరోనా దెబ్బకి సమాజంలో చాలా చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరి పెళ్లిళ్లు వాయిదా పడితే, మరికొందరు ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం పెండ్లికుమారుడు, కుమార్తె మాత్రమే గుడికి వెళ్లి దండలు మార్చుకుంటున్న ఘటనలున్నాయి. తాజాగా పెండ్లి కుమారుడిని కరోనా జైలుకు పంపింది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఏం చేద్దాం పెండ్లి రిసెప్షన్ చాలా తక్కువ మందితో నిర్వహించినా…ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
ఈ విచిత్ర ఘటన ఒడిషా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఆ రాష్ట్రంలోని కంధమల్ జిల్లాలోని నౌపాద గ్రామలంఓ పరమేశ్వర్ భుక్తా అనే యువకుడి పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు పట్టుమని 60 నుంచి 80 మందిలోపు గ్రామస్తులు హాజరయ్యారు. అయితే కరోనా వైరస్‌ను అరికట్టే క్రమంలో ప్రభుత్వం లాక్‌డౌన్ చేపట్టింది. ఒడిషా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడ వద్దు.
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 60-80 మంది ఒకేచోట చేరడం, దానికి కారణమైన వరుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే శోభనం గదిలోకి వెళ్లాల్సిన వరుడు…కరోనా దెబ్బతో జైలుకు వెళ్లాల్సి రావడంతో బంధువులంతా ఆవేదన వ్యక్తం చేశారు.