హతవిథీ.. కరోనాకు కూడా సొంత వైద్యమా!

కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు సమర్థంగా పనిచేస్తాయంటూ స్వయంగా భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. కొంతమంది దేశ, విదేశీ వైద్యులు కూడా క్లోరోక్విన్ వాడొచ్చు అని సలహాలిచ్చారు. అంతే.. దెబ్బకి ఈ…

కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు సమర్థంగా పనిచేస్తాయంటూ స్వయంగా భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. కొంతమంది దేశ, విదేశీ వైద్యులు కూడా క్లోరోక్విన్ వాడొచ్చు అని సలహాలిచ్చారు. అంతే.. దెబ్బకి ఈ మాత్రలకి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణలో ఈ మాత్రలకు కొరత వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మలేరియా నివారణకు వాడే ఈ క్లోరోక్విన్ మాత్రలకు ఏపీలో కూడా డిమాండ్ పెరిగింది. అవసరం ఉన్నవాళ్లు, లేనివాళ్లు కూడా ఎడాపెడా మాత్రల్ని వాడుతున్నట్టు కొంతమంది వైద్యుల దృష్టికి వచ్చింది. దీంతో అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడింది.

వైద్యుల సూచన మేరకు వాడాల్సిన ఈ మందుల్ని జలుబు, దగ్గు ఉన్నవారు కూడా ముందు జాగ్రత్తగా రెండు వేసేసుకుంటున్నారు. వేసుకుంటే వేసుకున్నారు, లేని ముప్పు కొని తెచ్చుకుంటున్నారు. ఇష్టప్రకారం ఈ మాత్రలు వాడితే గుండెపోటు వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వైద్యులు సూచిస్తేనే వీటిని వాడాలని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా క్లోరోక్విన్ అమ్మొద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి.

కరోనా మందు అంటే చాలు, జనం ఎగబడిపోతున్నారు, చాలా జిల్లాల్లో హోమియో మాత్రలంటూ ఉచిత వైద్యశిబిరాలు పెట్టి.. ఇప్పటికే జనాలకు మందులు పంపిణీ చేశారు కొంతమంది స్వచ్ఛంద సేవకులు. అధికారులు సీరియస్ కావడంతో ఇలాంటి వ్యవహారాలు ఆగిపోయాయి. ఇప్పుడిక క్లోరోక్విన్ మాత్రలపై పడ్డారు జనం. అదిగో ఔషధం అంటూ ప్రకటించిన ఒక రోజు లోనే జనం ప్రవర్తన చూసి వాటిపై ఆంక్షలు విధించారు అధికారులు.

అసలే భారత్ లో సొంత వైద్యం ఎక్కువ. నేరుగా మెడికల్ షాపుకు వెళ్లడం, టాబ్లెట్స్ కొనుక్కొని వేసుకోవడం ఇక్కడ సర్వసాధారణం. నిజానికి తలనొప్పి, జలుబు కోసం వేసుకున్న టాబ్లెట్ కూడా శరీరంలో ఏదో ఒక అవయవంపై దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటిది అత్యంత శక్తిమంతమైన మలేరియా టాబ్లెట్లను విచ్చలవిడిగా వాడితే.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. క్లోరోక్విన్ ని ఇష్టానుసారం వాడితే ఆరోగ్యవంతులు కూడా మంచాన పడే ప్రమాదం ఉంది.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్