ప్రధాని మోడీ పనిమంతుడే కాదు, మంచి ప్రచారమంతుడు కూడా. మోడీ ఏం చేసినా మీడియాతో పాటు, సోషల్ మీడియాలో కూడా మారుమోగిపోవాల్సిందే. అసలీ ప్రచారంతోనే ఆయన గుజరాత్ నుంచి ఏకంగా ఢిల్లీ గద్దె మీద కూర్చున్నారని కూడా చాలామంది అంటారు. ఆ సంగతి అలా ఉంచితే.. కరోనా వేళ సోషల్ మీడియాలో మోదీపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. బిగ్ బాస్ వస్తున్నాడు, టాస్క్ ఇస్తాడు అని వెటకారాలు ఎక్కువయ్యాయి కూడా.
అయితే తాజాగా జన్ ధన్ ఖాతాల్లో కేంద్రం జమ చేసిన నిధులు, ఉచితంగా ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రచారాన్ని ఉధృతం చేసింది. కనీసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్థాయిలో బాకాలు ఊదుకోవడం లేదు, కానీ కేంద్రం మాత్రం ప్రతి రాష్ట్రం నుంచి లబ్ధిదారులతో స్థానిక భాషలో మాట్లాడించి, మోదీకి కృతజ్ఞతలు చెప్పించి.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దూరదర్శన్ ఛానెల్ ని, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని ఈ కార్యక్రమాలకు బాగా వాడుకుంటోంది.
ప్రచారం అవసరమే, దాని వల్ల ఇంకా ఆర్థికసాయం తీసుకోనివారు అలెర్ట్ అవుతారు. మరి అదే సమయంలో జన్ ధన్ ఖాతా లేని పేదల సంగతేంటి? బ్యాంకులు, ఏటీఎం కార్డులు అంటే తెలీని వలస కూలీల గతి ఏంటి? కూలీనాలీ కోసం ఇతర ప్రాంతాలకు వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన లక్షలాది మంది గురించి ప్రధాని ఆలోచిస్తున్నారా లేదా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
నాలుగు జన్ ధన్ ఖాతాల్లో డబ్బులేసి, మరో 10మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, ఈఎంఐలపై మారటోరియం విధిస్తే.. అంతా బాగున్నట్టేనా? రోడ్డునపడ్డ నిరుపేదల కష్టాలు ఎవరు తీరుస్తారు? వారి ఆకలి తీర్చడానికి స్వచ్ఛందంగా చాలామంది ముందుకొస్తున్నారు సరే.. లాక్ డౌన్ తో చిన్నాభిన్నమైన వారి ఆర్థిక జీవనం గాడినపడేదెట్టా? ఎంతసేపు అకౌంట్లు ఉన్నవారు, కిస్తీలు కట్టేవారి గురించి ఆలోచించే ప్రభుత్వాలు, నిజమైన పేదల గురించి పట్టించుకుంటున్నాయా లేదా అని ప్రశ్నిస్తున్నారు జనం. ఎక్కడికక్కడ వలస కూలీల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద వదిలి చేతులు దులుపుకొంది కేంద్రం. కొంతమందికి 500 రూపాయలు విదిల్చి అదే మహాభాగ్యంలా భావించమంటే ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టా లేదా?
ప్రచారం మీద పెట్టిన శ్రద్ధ… వలస కూలీల కష్టాలు తీర్చే విషయంపై పెట్టి ఉంటే.. మంచి ఫలితాలు వచ్చి ఉండేవని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.