తమ్ముళ్ళకు చేతికి పని లేదు. దాంతో నోటికి బాగానే పని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ క్వారంటైన్ లో ఉండి ఇంటికెళ్ళిన వారి చేతిలో రెండు వేలు పెట్టాలని, ఆ విధంగా వారికి ఆర్ధిక భరోసాతో పాటు, పౌష్టిక ఆహారాన్ని అందించేలా వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిజంగా ఈ తరహా ఆర్ధిక సాయం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరూ ప్రవేశపెట్టలేదు. మరి జగన్ బుర్రలో పుట్టిన ఈ ఆలోచనకు కూడా తమ మార్కు పసుపు రంగులేసుకుందామని తమ్ముళ్ళు ఉబలాటపడుతున్నారు.
రెండు వేలేంటి మరీ చీప్ గా, ఏకంగా పదివేలు ఇవ్వండి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ తమ్ముడు బుద్ధా నాగజగదీశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఆర్ధిక ఇబ్బందులు తెలుసు, అయినా కూడా ఇలా డిమాండ్ చేస్తున్నారంటే తన కాలు చేయీ కాకపోతే కాశీ దాకా డేకమని అనడమే కదా అని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు.
చంద్రబాబు పుణ్యమాని కొత్త ఆలోచనలు, సరికొత్త దీక్షలకు ఈ తమ్ముడు తెర తీశాడు. ఏకంగా తన ఇంట్లో కూర్చుని పన్నెండు గంటల నిరశన దీక్షట. అది కూడా కరోనా బాధితుల తరఫున నిరశనట. సర్కార్ ఆర్ధిక సాయం కోసమట. ఇవన్నీ సరే కానీ మరి ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ నుంచి ఎంత మేర ఆర్ధిక సాయం చేశారో కూడా చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు.
ఏది ఏమైనా రాజకీయం మాత్రం మారకూడదు, కరోనా వచ్చినా వైరి పక్షాన్ని వదలకుండా కరిచేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాక ఇక ఎవరు చెప్పినా వినేదేముంది. అంతే.