సరిగ్గా ఐదేళ్ల కిందట.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించినప్పుడు, నాడు కూడా ప్రధానమంత్రి హోదాలో ఉండిన నరేంద్రమోడీ అక్కడ ఎన్నిక గిమ్మిక్కులు చాలానే చేశారు. అప్పట్లో నితీష్ కుమార్- లాలూ ప్రసాద్ యాదవ్ లు చేతులు కలిపారు. ఆర్జేడీ-జేడీయూల కూటమిని ఎదుర్కొనడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. వాళ్ల కూటమిని తప్పు పట్టింది. నితీష్ కుమార్ పై అయితే బీజేపీ నిప్పులు చెరిగింది. ఆయనను అవకాశవాదిగా తప్పుపట్టింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవడానికి రంగంలోకి దిగిన మోడీ ఒక వేలం పాట లాంటిది పాడారు. బిహార్ అభివృద్ధి కోసం ప్యాకేజీ అంటూ.. అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అంటూ మొదలుపెట్టి లక్షల కోట్ల వరకూ సాగింది మోడీ వేలం పాట! అలా మోడీ తమ పార్టీని గెలిపిస్తే లక్షల కోట్లు బిహార్ పై వెదజల్లుతామంటూ ప్రకటనలు చేసినా.. నాటి ఎన్నికల్లో బీజేపీ చిత్తయైంది.
ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ల కూటమి మెజారిటీని సాధించింది. చిన్నబుచ్చుకోవడం మోడీ వంతు అయ్యింది. అయితే ఆ తర్వాత తిమ్మిని బమ్మిని చేశారు. నితీష్ కుమార్ మరోసారి అవకాశవాదాన్ని చూపించాడు. బీజేపీతో జట్టు కట్టాడు, ఆర్జేడీకి హ్యాండిచ్చాడు. దీంతో ఆ ప్రభుత్వం పడిపోయింది, కొత్త ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయిపోయింది. మరి అదేం నైతికతో, అదేం హిందుత్వమో బీజేపీ భక్తులకే తెలియాలి!
ఇప్పుడు మళ్లీ నరేంద్రమోడీ బిహార్ లో దిగారు. వరసగా వివిధ శంఖుస్థాపనలు, హడావుడి.. ఐదేళ్ల కిందట నితీష్ తీవ్రంగా విమర్శించిన మోడీ, పదిహేనేళ్లుగా బిహార్ కు నితీష్ అద్భుత సేవలు చేస్తున్నారంటూ ఇప్పుడు కొనియాడుతున్నారు! మరి గతంలో బిహార్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారాలను పట్టించుకోలేదు, ఆయన లక్షల కోట్ల ప్యాకేజీలు కూడా వద్దని బీజేపీ వ్యతిరేక కూటమినే ఎన్నుకున్నారు. మరి ఈ సారి వారి స్పందన ఎలా ఉంటుందో!