బియ్యం అంటే ఎక్కడైనా ఒక్కటే. అది ఉడికితే అన్నం అవుతుంది. ఆకలి తీర్చి ప్రాణం పోస్తుంది. కానీ ఆ నూకల నుంచి కూడా ఓట్ల లాభాన్ని పొందేందుకు దేశాన రాజకీయం పెద్ద ఎత్తున సాగుతోంది.
ఇది గతంలో ఎన్నడూ చూడని పరిణామమని కూడా అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే ఆంధ్రా కోడలు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్రా పర్యటన చేశారు. ఇందులో భాగంగా ఆమె విశాఖ జిల్లాలో ఒక రేషన్ షాపుకు వెళ్ళి అక్కడ లబ్దిదారులతో ముచ్చటించారు.
కేంద్రం ప్రజల కోసం కరోనా కాలంలో ఉచితంగా బియ్యం ఇస్తోంది. దాంతో ఆమె ఈ అంశాన్ని జనాల బుర్రలో పెట్టేందుకు ఇది మోడీ బియ్యం తెలుసా అంటూ అడిగారు. ఇక మోడీ బొమ్మ రేషన్ షాపులలో ఉంచి మరీ ఆ బియ్యాన్ని పంపిణీ చేయాలని కూడా నిర్మల కోరడం విశేషం.
జగన్ సర్కార్ బియ్యం వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్తుంది. అయితే మోడీ బియ్యాన్ని మాత్రం చౌక దుకాణాల వద్దనే పంపిణీ చేయాలని ఆమె కోరడం ద్వారా తేడా జనాలకు తెలియాలని సూచించారు.
దేశానికే మోడీ అన్న లాంటి వారని, ఆ అన్న ఇస్తున్న అన్నపూర్ణ లాంటి బియ్యం అంటూ నిర్మల బాగానే బీజేపీ ప్రచారాన్ని చేసిపెట్టారు. మొత్తానికి ఒక వైపు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవుతోంది ఆపండి అంటూ విన్నపాలు వస్తున్నా నిర్మలా సీతారామన్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.
అదే టైమ్ లో ఇది మోడీ బియ్యం, అది జగన్ బియ్యం అంటూ కేంద్ర మంత్రుల స్థాయిలో రాజకీయం చేయడమేంటి అన్న దాని మీద మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.