టీడీపీ, జనసేన అధిపతులైన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు ఇది షాకింగ్ న్యూస్. ఢిల్లీలోని అంబేద్కర్ కేంద్రంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారసత్వ రాజకీయాలపై మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టిక్కెట్లు నిరాకరించడం జరిగితే దానికి తానే బాధ్యుడనని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఏపీలో టీడీపీ, వైసీపీ వారసత్వ రాజకీయ పార్టీలని, వాటికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే.
దివంగత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆయన అల్లుడు నారా చంద్రబాబునాయుడు, ఆ తర్వాత లోకేశ్ వారసత్వ రాజకీయాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా వైఎస్ జగన్ తనవైన రాజకీయాలు చేస్తుండడం చూస్తున్నాం. ఈ రెండు ప్రాంతీయ పార్టీలవి వారసత్వ రాజకీయాలుగా బీజేపీ భావిస్తోంది. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమనే నినాదంతో బీజేపీ కాంగ్రెస్‌ను చావు దెబ్బతీసింది. మున్ముందు గాంధీ కుటుంబం నేతృత్వం వహించే కాంగ్రెస్‌కు నామరూపాలు లేకుండా చేసేందుకు వారసత్వ రాజకీయానికి వ్యతిరేకమనే అస్త్రాన్ని ప్రయోగించడాన్ని కొనసాగించే క్రమంలో బీజేపీ తన పార్టీలో వాటికి దూరంగా ఉంటోంది. ఏపీలో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తుల గురించి చర్చ జరుగుతోంది.
మరీ ముఖ్యంగా నిన్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం పొత్తు చర్చకు తెరలేపింది. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీతో కూడా పొత్తు అవకాశాలున్నాయని పరోక్షంగా జనసేనాని ప్రస్తావించిన నేపథ్యంలో… వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే టీడీపీతో బీజేపీ కలయికకు మోదీ వ్యాఖ్యలు ఫుల్‌స్టాప్ పెట్టినట్టైంది.
అంతేకాదు, బీజేపీని కాదని టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంటుందా? అనే చర్చకు మోదీ వ్యాఖ్యలు తెరలేపాయి. జనసేనాని ప్రతిపాదనలపై బీజేపీ స్పందన ఏంటో… మోదీ వ్యాఖ్యల నుంచి తెలుసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.