వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చం అని పవన్ ప్రకటించారు. అంటే దానర్థం టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా, బీజేపీతోనే ఉంటారా అనేది తర్వాత సంగతి. ఇక్కడ అసలు మేటర్ ఇది కాదు. నిజంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే వైసీపీ ఓడిపోతుందా?
151 సీట్లు గెలిచిన జగన్ పార్టీ.. కేవలం 7శాతం ఓటు బ్యాంక్ కలిగిన, ఒకే ఒక్క ఎమ్మెల్యేతో ఉన్న జనసేన పార్టీ టీడీపీకి మద్దతిస్తే ఓడిపోతుందా? నిజంగా వైసీపీపై అంత ప్రజావ్యతిరేకత ఉందా? ఉంటే దాని పర్సంటేజీ ఎంత?
వైసీపీని ఓడించేంత స్థాయిలో ఏపీలో వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉందా? 2014 సీన్ ను 2024లో రిపీట్ చేస్తే చంద్రబాబు గెలిచేస్తారా? అప్పటి పరిస్థితులేంటి? ఇప్పటి పరిస్థితులేంటి? అప్పుడు పవన్ ను నమ్మిన జనం, ఇప్పుడు నమ్ముతారా? అసలు పవన్ కల్యాణ్ పిలుపునిస్తే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఏకం అవుతుందా?
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత..?
ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. నిజంగా దేవుడే పాలన కొనసాగించినా ఎంతోకొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. సహజంగా అది 8 నుంచి 16 శాతం వరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకుల భావన. నెగెటివ్ ఓట్ ట్రాన్స్ ఫర్ రేట్ అనేది అధికార పక్షానికి ఎప్పటికీ ప్రమాదకరమే.
గతంలో తాము అధికార పార్టీకి ఓటు వేశామని, ఈసారి అదేఓటు ప్రతిపక్షానికి వేస్తామని జనం చెబితే.. అలాంటి వారు 16శాతం మంది ఉంటే.. కచ్చితంగా ప్రతిపక్షాలదే విజయం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆ వ్యతిరేక ఓటుని చీల్చకుండా తాము లాభపడతామని జనసేనాని చెబుతున్నారు.
కానీ ఏపీలో వ్యతిరేక ఓటు ఎంత ఉంది..? రోడ్లు బాగాలేవని, ఏపీ అప్పుల్లో ఉందని, ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడంలేదని.. ఇలా కొంత నెగెటివ్ టాక్ ఉందనేది వాస్తవం. కానీ ఇలా మాట్లాడుకునేవాళ్లంతా సామాన్య ప్రజలు కాదు. తమని తాము మేథావులుగా భావించే వర్గం. ఆ వర్గం ఎలాగూ పోలింగ్ స్టేషన్లకు రాదు.
ఒకవేళ వాళ్లంతా ఓటేసినా కేవలం 3 నుంచి 5 శాతం ఉంటుందని అంచనా. వీళ్లంతా గతంలో వైసీపీకి ఓటు వేసి ఉండాలనే రూల్ లేదు. అంటే.. నెగెటివ్ ఓట్ ట్రాన్స్ ఫర్ అనేది ఏపీలో లేదు. 2019లో వైసీపీకి ఓటు వేసిన వీరాభిమానులంతా ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నారు. మరిక్కడ ట్రాన్స్ ఫర్ ఓట్ సంగతేంటి..?
అటు..ఇటు.. ఎవరు ఎటు?
2019లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య చీలిన ఓట్లు 2024నాటికి వారంతా పొత్తులో ఉంటే గుంపగుత్తగా పడతాయి. అంతే కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీరికి బదిలీ అయ్యే అవకాశమే లేదు. ఆ లెక్కన టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి ఎన్ని సీట్లు సాధించాయో.. 2024లో కూడా అన్నే సీట్లు వస్తాయి. టీడీపీ 23, జనసేన 1, బీజేపీ సున్నా.. మొత్తం కలిపి 24. వీరిలో ప్రస్తుతం ఐదుగురు వైసీపీవైపు వచ్చేశారు. అంటే 19 మిగిలాయి.
వీరిలో కూడా కొంత వ్యతిరేకత ఉందనేది వాస్తవం. మరి వారంతా ఎన్నికలనాటికి వైసీపీ వైపు వచ్చేస్తే.. ఇక కాలకూట కషాయం గుంపులో మిగిలేది ఎంతమంది, ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు. పోనీ గతంలో తక్కువ మార్జిన్ తో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలంతా ఈసారి ఓడిపోతారని అనుకున్నా.. ఆ సంఖ్య కూడా 10లోపే ఉంటుంది.
2014లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి ఏమేం ఫ్యాక్టర్స్ పనిచేశాయో అందరికీ తెలుసు. ఇప్పుడా పరిస్థితులు ఏమాత్రం లేవు. చంద్రబాబు నయవంచనపై అందరికీ ఓ క్లారిటీ ఉంది. పవన్ రాజకీయాలపై జనాలకు పూర్తి స్పష్టత ఉంది. ఇక బీజేపీ మేక వన్నె పులి రాజకీయాలు కళ్లకు కట్టేలా కనిపిస్తున్నాయి. సో.. ఈ 3 పార్టీలు కలిసి 2024లో ఏ మేరకు ఏపీలో ప్రభావం చూపిస్తాయో ప్రజలు ఈజీగా ఓ అంచనాకు రావొచ్చు.