లాక్ డౌన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రధాని మోడీ. ఎలాంటి మినహాయింపులు ఇవ్వాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలనే అంశాలపై ఈరోజు ఓ నిర్ణయం తీసుకుంటారు. అయితే కనీసం ఇప్పటికైనా వలసకూలీల్ని ప్రధాని పట్టించుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
లాక్ డౌన్ పడ్డంతో దేశవ్యాప్తంగా వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిలేక ఉన్న చోట ఉండలేక, సొంత ఊళ్లకు వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. తెగించి కాలినడకన బయల్దేరిన వాళ్లు కోకొల్లలు. వీళ్లలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈసారి మినహాయింపులు ఇచ్చినప్పుడు వలసకూలీల్ని లెక్కలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సామాజికవేత్తలు.
విదేశాల నుంచి వచ్చిన వారికోసం, విద్యార్థుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటుచేసి, క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వమే బస్సుల్లో ఇళ్లకు పంపిస్తోంది. మరి ఇదే పని వలసకూలీల విషయంలో చేయొచ్చు కదా.. దేశవ్యాప్తంగా కనీసం ఓ 3 రోజుల పాటు వీళ్ల కోసం రైళ్లు నడిపితే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికే అరకొర సదుపాయాలతో, అందీఅందని ప్రభుత్వ సాయంతో ఇబ్బంది పడుతున్న వీళ్లు.. కనీసం తమ సొంతూరులో కుటుంబసభ్యులకు దగ్గరగా అయినా ఉంటారు కదా.
కట్టెలపొయ్యితో కష్టాలు పడే కుటుంబాలకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే ఏం లాభం. అసలు బ్యాంకులంటే ఏంటో తెలియని పేదల అకౌంట్లకు ప్రభుత్వం నగదు ఎలా బదిలీ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కానీ.. ఇతర ప్రాంతాల్లో రేషన్ కష్టాలు కూడా వర్ణనాతీతం. నెలకు 6 వేల రూపాయల కూలీకి కూడా ఇతర రాష్ట్రాలకు వస్తుంటారంటే సొంతూళ్లలో వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వలసకూలీల్ని వదిలేసి.. విదేశాల నుంచి వచ్చిన వారికి, విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రాన్ని ఏమనాలి?
ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీలు అవసరం లేదు. జీఎస్టీ మినహాయింపులు అడగరు, డీఏ పెంచమనీ గొడవ చేయరు, ఇన్ కం ట్యాక్స్ రిటర్నులకు గడువు పెంచాలనీ పట్టుబట్టరు. కనీసం లాక్ డౌన్ తర్వాతయినా ప్రత్యేక రైళ్లలో పేద కూలీలందర్నీ ఉచితంగా సొంత ప్రాంతాలకు తరలించి కాస్త ఆర్థిక సాయం చేస్తే అంతకంటే వారికింకేం అవసరం లేదు. అలాంటి నిరుపేదల్ని ఆదుకున్నప్పుడే ప్రభుత్వం మనుగడలో ఉన్నట్టు. ఈ దిశగా ప్రధాని త్వరగా ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.