ఎమ్బీయస్‌: పగ తీర్చుకున్న ఎలక్ట్రా

తండ్రికి, కూతురికి మధ్య ఉండే అనుబంధం మితిమీరితే దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్సంటారు. ఆ పేరు రావడానికి మూలకారణమైన గ్రీకు పురాణపాత్ర ఎలక్ట్రా కథ చెప్పబోతున్నాను. ఇలాటిది ఏదైనా రాయగానే కొందరు పాఠకులు యివన్నీ మాకెందుకు,…

తండ్రికి, కూతురికి మధ్య ఉండే అనుబంధం మితిమీరితే దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్సంటారు. ఆ పేరు రావడానికి మూలకారణమైన గ్రీకు పురాణపాత్ర ఎలక్ట్రా కథ చెప్పబోతున్నాను. ఇలాటిది ఏదైనా రాయగానే కొందరు పాఠకులు యివన్నీ మాకెందుకు, రామాయణ, భారతాలు రాయండంటున్నారు. ఆ కథలు చిన్నప్పటి నుంచీ వింటున్నాం. అమర్‌ చిత్రకథ కామిక్స్‌లో చదివాం. సీరియళ్లలో, సినిమాల్లో చూశాం. అన్ని టీవీ ఛానెళ్లు ఉదయం వాటి గురించే ప్రసంగాలు చూపిస్తాయి. కొన్ని ఛానెళ్లయితే రోజంతా చూపిస్తాయి.

అందువలన వాటిలోని విశేషాంశాలు చెప్పాలనిపిస్తే తప్ప, సాదాసీదాగా రాయబుద్ధి కాదు నాకు. ప్రపంచదేశాలెన్నో ఉన్నాయి. ఎవరి పురాణగాథలు వారికున్నాయి. కొన్ని వేల సంవత్సరాలపాటు మనగలిగాయంటే వాటిలో రసవత్తరమైన కథ ఉన్నట్లే కదా. మనకు అవన్నీ తెలియవు. తెలుసుకుంటే పుణ్యమేమీ రాదు కానీ ఓ చక్కటి జానపద కథ చదివిన అనుభూతి కలుగుతుంది.

మన పురాణాల్లో కంటె ఎక్కువ రంకులు, బొంకులు వాటిల్లో వుంటాయి. అవి చదవడం నాకిష్టం. నాకే కాదు, చాలామంది కిష్టం. అందుకే ‘‘ట్రాయ్‌’’, ‘‘హెర్క్యులస్‌’’, ‘‘థార్‌’’ వంటి సినిమాలు చూస్తూంటారు. అలాటి వాళ్ల కోసం యివన్నీ రాస్తూంటాను. చదివేవాళ్లున్నా రనుకుంటే ‘‘థార్‌’’ కూడా రాస్తాను. ఇవన్నీ అక్కర్లేదనుకున్నవారు కాప్షన్‌లో భారతీయేతరమైన పేరు చూసి పేజీ తిప్పేయవచ్చు. పని గట్టుకుని వచ్చి, ‘ఇది మనకు అవసరమా?’ అని అడగడం చిలిపితనం.

ఇదే కాదు, ఏదీ చదవాల్సిన అవసరం లేకుండా బతికేయవచ్చు. ఊపిరి, కళ్లకు చూడగలిగే శక్తి, బుర్రకు అర్థం చేసుకునే శక్తి ఉన్న కొద్దినాళ్లలో సాధ్యమైనన్ని విషయాలు తెలుసుకుందామని అనుకున్నవాళ్ల కోసమే నా రచనలు. రకరకా అంశాలపై ఆసక్తి లేనివారు యిటు తొంగి చూడడం వేస్టు. నా ప్రతి ఆర్టికల్‌కు ముందు నా పేరు వుంటుంది – జాగ్రత్త, బోరు కొడతాడు అని హెచ్చరిస్తుంది. అందువలన అలాటి వాళ్లు ప్లీజ్‌ టేక్‌ డైవర్షన్‌. వేరే రూటులో వెళ్లండి.

ఇక ఎలక్ట్రా గురించి చెప్పాలంటే ఆమె తన తండ్రిని ఎంతో అభిమానించి, అతని హత్యకు బదులు తీర్చుకుంటుంది. ఈ పురాణగాథను చాలామంది నాటకాలుగా క్రీ.పూ.5 వ శతాబ్దంలోనే మలిచారు. కథల్లో తేడాలు కనబడతాయి. ఈ కథాంశంపై హాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయో లేదో కానీ ‘‘ఎలక్ట్రా, మై లవ్‌’’ (1974) అనే హంగేరియన్‌ సినిమా చూశాను. పవర్‌ఫుల్‌ లేడీ కారెక్టరు చుట్టూ సినిమా తీసి దానికి ‘‘ఎలక్ట్రా’’ అని పేరు పెట్టిన సందర్భాలున్నాయి.

ట్రాయ్‌ యుద్ధం గురించి చాలామంది పాఠకులకు తెలిసే వుంటుంది. ట్రాయ్‌ రాకుమారుడైన పారిస్‌, గ్రీకు రాజైన మెనెలియాస్‌ అనే రాజు యింటికి అతిథిగా వెళ్లి అతని భార్య అయిన అందాల రాణి హెలెన్‌ను వలచి, వలపింప చేసుకుని ఆమెను లేవదీసుకుని తన నగరానికి పారిపోయి వచ్చేశాడు. ట్రాయ్‌ రాజు వారికి అండగా నిలిచాడు. హెలెన్‌ను వెనక్కి పంపేయమని గ్రీకులు ఎంత అడిగినా యివ్వలేదు. దాంతో గ్రీకులంతా ట్రాయ్‌పై దండెత్తి, పదేళ్లపాటు యుద్ధం చేసి చివరకు ఆ నగరాన్ని ధ్వంసం చేశారు.

గ్రీకు సేనకు సైన్యాధ్యక్షుడిగా పని చేసిన మహావీరుడు ఆగ్యమెనాన్‌, బాధితుడు మెనెలియాస్‌కు అన్న, ఆర్గోస్‌ రాజ్యానికి రాజు. ఈ సోదరులు అక్కచెల్లెళ్లయిన క్లయిటెమ్‌నెస్త్రా, హెలెన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆగ్యమెనాన్‌, క్లయిటెమ్‌నెస్త్రాల కూతురే ఎలక్ట్రా. ఈమెకు అక్క ఇఫిజెనియా, అన్న ఆరెస్టెస్‌ ఉన్నారు. ఎలక్ట్రా తండ్రి ట్రాయ్‌పై యుద్ధానికి వెళ్లగా చూసి తల్లి కుట్ర చేసింది. ఆమెకు తన భర్తంటే యిష్టం లేదు. ఎందుకంటే ఆమె పూర్వభర్తను చంపి యీ ఆగ్యమెనాన్‌ తనను పెళ్లాడాడు. తనుండగానే అనేకమంది ఉంపుడుగత్తెల నుంచుకున్నాడు.

పైగా తన సేనలు క్షేమంగా ట్రాయ్‌ చేరాలంటే కూతుర్ని నరబలి యివ్వాని ఎవరో జోస్యులు చెపితే, పెద్ద కూతురు ఇఫిజెనియాను బలి యిచ్చేశాడు. అది కూడా మహావీరుడైన ఎకిలిస్‌తో పెళ్లి చేస్తానని ఆశ పెట్టి తీసుకెళ్లి, ఆమెను చంపేశాడు. భార్యకు ఒక్క మాట చెప్పలేదు. ఇదంతా ఆమెకు విపరీతమైన కోపం తెప్పించింది. భర్త యుద్ధరంగానికి వెళ్లగానే అతని దాయాది ఐన ఈజిస్థస్‌‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ ఈజిస్థస్‌కు, తన భర్తకు తండ్రుల కాలం నుంచి చచ్చేటంత పగ. తన భర్త వంటి మహాబలశాలిని చంపాలంటే అలాటివాడే కావాలి.

ఆగ్యమెనాన్‌ యుద్ధంలో గెలిచి వస్తూవస్తూ ట్రాయ్‌ రాకుమారి కెసెండ్రాను ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు. ఇది భార్యను మరింత మండించింది. తన ప్రియుడితో కలిసి రాచసౌధంలోనే భర్తను స్నానాలగదిలో ఏ ఆయుధమూ దగ్గర లేని సమయంలో, పైన దుప్పటి కప్పేసి, ప్రతిఘటించడానికి వీల్లేకుండా చేసి చంపేసింది. స్వహస్తాలతో అతని కొత్త ఉంపుడుగత్తెను చంపేసింది. రాకుమారుడు అరెస్టెస్‌ను కూడా చంపేద్దామని ఈజిస్థస్‌ అనుకున్నాడు కానీ ఒక ముసలి సేవకుడు అతన్ని తప్పించివేశాడు. అతను పొరుగున ఉన్న క్రిసా రాజ్యానికి పారిపోయాడు. ఆ దేశపు యువరాజు పైలాడెస్‌కు స్నేహితుడై అక్కడ తలదాచుకున్నాడు.

ఈజిస్థస్‌ సైన్యాలకు పాత రాజు విధేయులు లొంగిపోయారు. అతను ఆర్గోస్‌కు రాజయ్యాడు. క్లయిటెమ్‌నెస్త్రాను బహిరంగంగా పెళ్లాడలేదు కానీ వాళ్లిద్దరూ భార్యాభర్తల్లాగానే జీవిస్తున్నారు. ఎలక్ట్రా వయసులో చిన్నది కాబట్టి బతికిపోయింది. కానీ ఆమెకు యుక్తవయసు వచ్చేసరికి ఈజిస్థస్‌కు బెంగ పట్టుకుంది. ఎవరైనా రాకుమారుడికిచ్చి పెళ్లి చేస్తే అతను తండ్రి సహాయంతో తనపై తిరగబడవచ్చు. పాత రాజుకు అన్యాయం జరిగిందని భావిస్తున్న ప్రజలు ఎలక్ట్రాకు, ఆమె భర్తకు మద్దతు యివ్వవచ్చు.

అందువలన ఎవడైనా పేదవాడికి యిచ్చి పెళ్లి చేస్తే వాడు రాజు కావడానికి ప్రజలు ఆమోదించరు అనుకుని ఆమెను ఒక పేదరైతుకి యిచ్చి పెళ్లి చేసి పంపేశాడు. ఎలక్ట్రా తల్లి దీనికి అభ్యంతరం తెలపలేదు. తను భోగభాగ్యాలతో తులతూగుతూండగా, అవతల కూతురు పేదరికంలో మగ్గుతూ వున్నా ఆమెకు చీమ కుట్టినట్లు లేదు. ఇదంతా తలచుకుని కుములుతూ ఎలక్ట్రా బతుకుతోంది. తన సోదరుడు దేశాంతరం నుంచి వెనక్కి వచ్చి, తండ్రి హత్యకు పగ తీర్చుకోవాలని ఆమె తపిస్తోంది.

అతను డెల్ఫిలోని అపోలో దేవాలయానికి వెళితే అక్కడ అపోలో దేవుడు నీ తండ్రిని చంపిన తల్లిని, ఆమె ప్రియుణ్ని చంపి పగ తీర్చుకో అని ఆదేశించాడు.  ఆ ఆదేశం మేరకు అతను తన స్నేహితుడు పైలాడెస్‌ను వెంటపెట్టుకుని ఆర్గోస్‌కు తిరిగి వచ్చాడు. ఎవరూ పట్టించుకోకుండా దిక్కుమాలిన స్థితిలో వదిలేసిన తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించి, తన చెల్లెలు ఎలక్ట్రాను వెతుక్కుంటూ పేదలుండే వాడకు వచ్చాడు.

అక్కడ ఒక పేదరాలు చెరువులోంచి కుండలో నీళ్లు తెస్తూ కనబడింది. ఆమె తన ఊరిజనంతో కలిసి ప్రవాసంలో ఉన్న అన్న ఎప్పటికి వస్తాడో, తండ్రి ఆత్మకు ఎన్నడు శాంతి చేకూరుస్తాడో అని వాపోవడం చాటుగా దాక్కుని చూశాడు. తనే ఎలక్ట్రా అని గుర్తించి, తన స్నేహితుడితో సహా బయటకు వచ్చి కనబడ్డాడు. కొత్తవాళ్లను చూడగానే ఎలక్ట్రా కంగారు పడి, తన స్నేహితురాళ్లను వెళ్లిపోమంది. అరెస్టెస్‌ తనను అరెస్టెస్‌ స్నేహితుడిగా పరిచయం చేసుకుని, ‘మీ అన్న నీ క్షేమం కనుక్కోమన్నాడు’ అని చెప్పాడు.

ఎలక్ట్రా తన కష్టాలను ఏకరువు పెట్టి, ‘మా నాన్న హత్యకు ప్రతీకారం కోసమే బతికి వున్నాను తప్ప ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మా అమ్మను, ఈజిస్థస్‌ను చంపే ప్రయత్నంలో నేను చచ్చిపోయినా ఫర్వాలేదు. మా అన్న తిరిగి వచ్చినా నేను గుర్తు పట్టలేను, మా ముసలి సేవకుడు గుర్తు పట్టాలి తప్ప..’ అంది. అప్పుడు అరెస్టెస్‌ అతన్ని రప్పించు అన్నాడు. అతను వచ్చాక ఫలానా అని చెప్పుకున్నాడు. అతని నుదుటిపై గాటు బట్టి సేవకుడు గుర్తించి ధృవపరిచాడు. ఎలక్ట్రా భర్త వారితో సహకరిస్తానన్నాడు.

అందరూ కలిసి శత్రువును ఎలా మట్టుపెట్టాలా అని ఆలోచించారు. ‘రాజప్రాసాదంలో వాళ్లను చంపడం కష్టం. ఇవాళ ఈజిస్థస్‌ ఒక మైదానానికి వెళ్లి దేవతకు ఒక ఎద్దును బలి యివ్వబోతున్నాడు. నువ్వూ, నీ స్నేహితుడూ అడ్డదారిలో వెళ్లి అతన్ని మార్గమధ్యంలోనే కలవండి. అతిథి మర్యాద కోసం అతను మిమ్మల్ని ఆహ్వానిస్తాడు.  అదను చూసి వేటు వేసేయ్‌. చుట్టూ తక్కువమంది సైనికులే వుంటారు. నువ్వు ఫలానా అని చెపితే పాత రాజుపై గౌరవంతో నిన్నేమీ చేయరు.’’ అని సేవకుడు సలహా చెప్పాడు.

‘‘ఈజిస్థస్‌ చనిపోయాడని తెలియగానే రాణి బయటకు రాదు. మరి ఆమెను చంపడం ఎలా?’’ అని అడిగాడు అరెస్టెస్‌. ‘‘నువ్వు ఆ పనిలో వుండగానే నేను అమ్మను మా యింటికి రప్పిస్తాను. నేను ఒక బిడ్డకు జన్మనిచ్చానని కబురు పెడతాను. మర్యాదకైనా చూడడానికి వస్తుంది. నేను  యింట్లోకి తీసుకెళ్లి నరికి చంపేస్తాను.’’ అంది ఎలక్ట్రా. నిజానికి ఎలక్ట్రాను పెళ్లి చేసుకున్న రైతు ఆమె పట్ల గౌరవంతో ఆమెను తాకనైనా తాకలేదు. కానీ రాణికి యీ విషయం తెలియదు కాబట్టి బిడ్డ పుట్టిందంటే నమ్ముతుంది.

వీళ్లు ప్లాను చేసినట్లే జరిగింది. ఈజిస్థస్‌ అరెస్టెస్‌ను, అతని స్నేహితుణ్ని ఆహ్వానించి బలి యివ్వడంలో సాయం చేయమన్నాడు. ఒక పదునైన కత్తి యిచ్చి ఎద్దుని చంపమన్నాడు. అరెస్టెస్‌ ఆ కత్తితో ఈజిస్థస్‌ తల నరికాడు. వెంట ఉన్న సైనికులు అతనిపై దాడి చేయబోతే తనెవరో చెప్పాడు. ఆగ్యమెనాన్‌ కొడుకని తెలియగానే వాళ్లూరుకున్నారు.

ఇక్కడ ఎలక్ట్రా, తన గుడిసెకు వచ్చిన తల్లిని నానా తిట్లూ తిట్టింది. ‘మా నాన్నంటే నీకు యిష్టం లేదు. నీ రంకుమొగుడితో కలిసి క్రూరంగా చంపేశావ్‌’ అని తిట్టింది. ‘మీ నాన్న నన్ను పట్టించుకోలేదు, ట్రాయ్‌ యువరాణిని ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు చూడు. నాకు కోపం వచ్చిందంటే రాదా?’ అంది తల్లి. ‘అంతకుముందే నువ్వు ఈజిస్థస్‌తో సంబంధం పెట్టుకున్నావు కదా, మా నాన్నను తప్పుపట్టే నైతికపరమైన హక్కు నీకెక్కడుంది? నీ చెల్లి హెలెన్‌ మొగుణ్ని వదిలేసి ప్రియుడితో పారిపోయి, ఒక మహాయుద్ధానికి కారకురాలైంది. నీది అలాటి చపలబుద్ధే’ అని తిట్టిపోసింది కూతురు.

‘అది కాదు, తన యుద్ధవిజయాల కోసం మీ అక్కను బలి యిచ్చేశాడు మీ నాన్న.  పిల్లలపై ప్రేమ ఉన్నవాడు అలా చేస్తాడా? నాకు అందుకే కోపం వచ్చి తనకు బుద్ధి చెప్పాలని ఈజిస్థస్‌కు చేరువయ్యాను’ అంది తల్లి. ‘నీకు  పిల్లలపై అంత ప్రేమ కారిపోతూ వుంటే, అన్నను ఈజిస్థస్‌ చంపాలని చూసినపుడు ఎందుకు అడ్డుపడలేదు? వాడెక్కడో దేశాలు పట్టిపోయాడు. మిగిలిన బిడ్డను నేనొక్కత్తినే. కావాలని ఈజిస్థస్‌ నన్ను ఒక పేదవాడికి యిచ్చి కట్టపెట్టినపుడు నువ్వెందుకు వద్దనలేదు? మా నాన్న వారసుల్లో పోయినవాళ్లు పోగా మిగిలిన నేను యిక్కడ అష్టకష్టాలు పడుతున్నాను. మా నాన్న ఆస్తిని, రాజ్యాన్ని అనుభవిస్తూ నువ్వు అక్కడ కులుకుతున్నావు.’’ అని దులిపేసింది.

ఇక సమాధానం చెప్పలేని క్లయిటెమ్‌నెస్త్రా ‘‘నీ  పిల్లవాణ్ని చూపించు, చూసి వెళ్లిపోతా’’ అంది. సరిగ్గా ఎలక్ట్రా తల్లిని గుడిసె లోపలకి తీసుకెళ్లే సమయానికి ఈజిస్థస్‌ను చంపి అరెస్టెస్‌ వచ్చి కలిశాడు. అన్నాచెల్లెళ్లు యిద్దరూ కలిసి తల్లిని నరికి ముక్కలు చేశారు. ప్రజలంతా సంతోషించారు. అరెస్టెస్‌ స్నేహితుడు పైలాడెస్‌ ఎలక్ట్రాను పెళ్లాడతానన్నాడు. ఎలక్ట్రా భర్త సంతోషంగా ఒప్పుకున్నాడు. అరెస్టెస్‌ అతనికి బహుమతులిచ్చి సత్కరించాడు.

వివాహానంతరం ఎలక్ట్రా క్రిసా రాజ్యానికి యువరాణి అయింది. అయితే అరెస్టెస్‌ ఆర్గోస్‌ రాజ్యానికి వెంటనే రాజు కాలేదు. మాతృహత్యకు గాను అతను ఏడాదికి పైగా ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది. ఇదీ ఎలక్ట్రా కథ. వచ్చే వ్యాసంలో ఎలక్ట్రా కాంప్లెక్సు గురించి. (ఫోటో – ఎలక్ట్రా, ఆమె సోదరుడు ఆరెస్టెస్‌ తారసపడిన ఘట్టం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
[email protected]