అతడి జీవితం చాలా సినిమాల్లోని కథానాయకుల్లా ఉంటుంది. అట్టడుగు స్థాయి నుంచి ఆరంభించి, అసాధారణ స్థాయికి ఎదిగిన కథ ఆయనది. ఈ ర్యాగ్స్ టు రిచెస్ కథలో ఇప్పుడు అనుకోని ట్విస్టు తలెత్తింది. విదేశాలకు వెళ్లి కోటీశ్వరుల స్థాయికి ఎదగాలనే కలలున్న భారతీయులకు రోల్ మోడల్స్ లో ఒకరైన బీఆర్ షెట్టి ఇప్పుడు పతనావస్థలో ఉన్నట్టున్నారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తిరుగులేని స్థాయిలో మొన్నటి వరకూ వెలిగిన బీఆర్ షెట్టి ఇప్పుడు అక్కడ నుంచి పరారయ్యి, భారత దేశంలో తలదాచుకున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఒక దశలో ఎమిరేట్స్ ధనికులు, రాజులతో భుజంభుజం రాసుకుపూసుకు తిరిగిన షెట్టి ఇప్పుడు ఇండియాలో తలదాచుకుని, తను పరారీ కాలేదని చెబుతున్నాడు. ఇంతకీ ఆయన కథేమిటంటే!
కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన వ్యక్తి భవగుతు రఘురాం షెట్టి. 1973లో ఎనిమిది డాలర్ల మొత్తాన్ని చేతిలో పట్టుకుని అబుదాబీలో దిగాడు. తన కష్టాన్నే పెట్టుబడిగా మార్చుకున్నాడు. తెలివితేటలను ముడిసరుకుగా మార్చి అక్కడే ఎదగడం మొదలుపెట్టాడు. 47 సంవత్సరాల పాటు పాటు ఎదుగుతూనే ఉన్నారు! ఈ క్రమంలో విదేశాల్లో బిలియనీర్ స్థాయిలో ఉన్న భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
ఎన్ఎంసీ హెల్త్.. బీఆర్ షెట్టి మానసపుత్రిక. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో హెల్త్ క్లైంట్ లను కలిగిన సంస్థ. ఎమిరేట్స్ లో బిగ్గెస్ట్ హెల్త్ కేర్ సంస్థగా నిలించింది ఎంన్ఎంసీ హెల్త్. 2012లో లండన్ స్టాక్ మార్కెట్ లో ఐపీవోకు వెళితే ఏకంగా 117 మిలియన్ పౌండ్ల ఫండ్ రైజింగ్ తో ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంస్థ అది. 2017లో మరో ప్రముఖ సంస్థను షెట్టి టేకోవర్ చేశారు. ఫోరెక్స్ బిజినెస్ లోని ట్రావెలెక్స్ సంస్థను కొన్నారు! ఆ డీల్ విలువు ఒక బిలియన్ పౌండ్లు!
కర్ణాటకలోని తీర ప్రాంతం అయిన ఉడిపి ఏరియా నుంచి గల్ఫ్ కు వలసలు ఎక్కువ. అలా వలస వెళ్లే వారికి బీఆర్ షెట్టి జీవితం ఒక స్ఫూర్తివంతమైన కథగా మారింది. గల్ప్ కు వెళ్లి ఈ షెట్టిలా ఎదగాలనే స్ఫూర్తి అనేక మందిలో రగిలేలా ఆయన ఎదుగుతూ వచ్చారు. గల్ఫ్ లో ఎదుగుతున్నా స్వదేశంతో సంబంధాలు పూర్తిగా తెంచుకోలేదు. ఇక్కడి రాజకీయ, సామాజిక ప్రముఖులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అంతే కాదు.. ఇక్కడ కూడా హెల్త్, ఫార్మాకు సంబంధించి వ్యాపార సంస్థలను నెలకొల్పారు. అలాంటి దాంట్లో ఒకదాన్ని మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాంతో కొన్నేళ్ల కిందట ప్రారంభింపజేశారు కూడా!
ఇండియాలో తను ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ లోకి రాబోతున్నట్టుగా ప్రకటించారు. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక సినిమాను తీయబోతున్నట్టుగా కూడా పేర్కొన్నారు. అదే మహాభారతం. మహాభారత కథను భారీ బడ్జెట్ సినిమా గా తీయబోతున్నట్టుగా ప్రకటన చేశారు. అయితే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఏదేమైనా బీఆర్ షెట్టి బిలియనీర్ గా ఒక వెలుగు వెలుగుతూ వచ్చారు.
కట్ చేస్తే… మడ్డీ వాటర్స్ అని ఒక వివాదాస్పద రీసెర్చింగ్ ఫైర్మ్ సంచలన కథనాన్ని ఇచ్చింది. ఎన్ఎంసీ హెల్త్ ఫైర్మ్ లో మోసాలు జరుగుతున్నాయనే పరోక్ష కథనాన్ని ఇచ్చింది. చైనా పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో అకౌంటింగ్ మోసాలను ఈ సంస్థ ప్రస్తావిస్తూ ఉంటుంది. యూకే స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన ఎన్ఎంసీ గురించి మడ్డీ వాటర్స్ పేర్కొన్న విషయాలు సంచలనం రేపాయి. ఆ విషయంలో ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్లు మొదలయ్యాయి.
ఎన్ఎంసీలో భారీగా అకౌంటింగ్ మోసాలు జరిగాయని.. ఆ సంస్థ తనకున్నఅప్పులను దాచిందని, 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న అప్పును తక్కువ చేసి చూపించిందని, అలాగే షెట్టికి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో వంద మిలియన్ డాలర్లకు సంబంధించిన చెక్కులు బోర్డు మెంబర్లకు తెలీయకుండా జారీ అయ్యాయని ఆ ప్రైవేట్ ఇన్వేస్టిగేషన్ తేలింది. ఈ విషయాలతో బీఆర్ షెట్టి సంస్థల పతానవస్థ మొదలైంది.
ఈ సంస్థల బోర్డు మెంబర్లలో కొందరు వైదొలిగారు, కొందరు తొలగింపబడ్డారు. ఎన్ఎంసీ హెల్త్ కేర్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాల నుంచి షెట్టి స్వయంగా వైదొలగాల్సి వచ్చింది. ఆయనపై ఫ్రాడ్, ఫోర్జరీకి సంబంధించి అబుదాబీలో క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. లండన్ స్టాక్ ఎక్సైంజ్ నుంచి ఎన్ఎంసీ ట్రేడింగ్ ను సస్పెండ్ చేశారు. ఈ ఏడాది మార్చి 24 నాటికి ఎన్ఎంసీ కి సంబంధించి అప్పుల చిట్టా తేలింది. అది కొన్ని వందల మిలియన్ డాలర్స్ లో ఉంది! మొత్తం 80కి పైగా ఆర్థిక సంస్థలకు ఎన్ఎంసీ బిలియన్ల కొద్దీ డాలర్లను అప్పు పడిందని తేలింది. ఆయన పేరిట, ఆయన కుటుంబీకుల పేరిట ఉన్న అకౌంట్లన్నింటినీ అక్కడి చట్టబద్ధ సంస్థలు ప్రీజ్ చేశాయి.
ప్రస్తుతం బీఆర్ షెట్టి వయసు 77 సంవత్సరాలు. ఏడాది ఫిబ్రవరిలోనే ఇండియాకు చేరుకున్నారు. అంతా మంచే జరుగుతుందని ఆయన అంటున్నారు. త్వరలోనే గుడ్ న్యూస్ అని కూడా విశ్వాసంగా చెబుతున్నారు. కరోనా క్రైసిస్ ముగిసి, విమానాలు కదిలాకా తను తిరిగి యూఏఈలో అగుడుపెట్టడం ఉంటుందంటూ చెబుతున్నారు!