నిత్యవసరాల ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మార్కెట్లో ఆహారోత్పత్తుల ధరలు పెరిగినా.. వాటిని పండించే రైతులు మాత్రం రోడ్డుకు ఎక్కారు! నెలలు గడుస్తున్నా పంజాబ్, హర్యానా రైతులను సముదాయించలేకపోతోంది మోడీ ప్రభుత్వం.
ఇక కరోనా లాక్ డౌన్లో కోట్ల మంది చిరుద్యోగులు ఉపాధిని కోల్పోయారు. మరోవైపు పెట్రోల్-డీజిల్ లపై వీలైనంత పిండుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. సెస్ లు పెంచేసి ధరలను ఆల్ టైమ్ హై కు తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం తీరుతో సామాన్యుడి విసిగిపోతూ ఉన్నాడు. అయితే హిందుత్వ-జాతీయవాద ప్రకటనలతో బీజేపీ నేతలు జనాలను ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నారు.
ఇక తాజాగా ప్రధానమంత్రి స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని చూసి రావడానికి వెళ్లే ప్రయాణికుల కోసం కొత్తగా రైళ్లను ప్రారంభించారు! ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీని మించి స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ నిలుస్తుందని.. రానున్న రోజుల్లో పటేల్ విగ్రహాన్ని చూడటానికి లక్షల మంది వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అదెక్కడ నుంచినో కానీ.. భారీ స్థాయిలో పర్యాటకులు వస్తారని, స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీని చూడటానికి వారంతా వస్తారని మోడీ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో స్ట్యాచ్యూ ఆప్ లిబర్టీ ని స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ మించి పోతుందని అన్నారు.
అయితే.. మోడీ ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతుల విషయంలోనో, ధరల పెరుగుదల గురించినో, ఉద్యోగ కల్పన గురించినో మాట్లాడి ఉంటే.. అంతా వినేవాళ్లు. సమస్యలు తీవ్రతరం అయిన సందర్భంలో ఇలా విగ్రహాలు, విదేశాలతో పోలికలు ఏమిటో సామాన్యుడికి అంతుబట్టవు. పర్యాటక ఆకర్షణలు అవసరమే. పర్యాటక రంగమూ ఉపాధే. కానీ.. స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీతో ఎంతమంది భారతీయుల జీవితాలు బంగారు మయం అవుతాయో మరి!
నిత్యవసరాల ధరలు పెరిగిపోయి.. ప్రజల జీవన వ్యయమే పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగా సంపాదనలు పెరిగే పరిస్థితి బయట లేదు! చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు ఉపాధినే కోల్పోయారు. మరి కొందరికి నామమాత్రపు జీతాలు అందడమూ గగనం అయ్యింది. వీరి సంఖ్య కోట్లలో ఉంది. ఇలాంటి సమయంలో మోడీ.. స్పందించిన అంశం మాత్రం సామాన్యులను విస్తుగొలుపుతూ ఉంది!