20 మంది కిడ్నాపర్లు, వారికి పది లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం.. ఇప్పటికే కిడ్నాప్ కు సంబంధించిన కీలక సూత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా కిడ్నాపింగ్ కు పాల్పడిన పాత్రధారులను కూడా మొత్తం అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఏకంగా 20 మంది ఈ కిడ్నాప్ లో పాల్గొన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త.. వీరితో ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు నిర్ధారించారు.
పది లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని, వాహనాలు ఇతర ఏర్పాట్లన్నీ భార్గవ్ రామ్, భూమా జగత్ విఖ్యాత్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్ అనంతరం.. వారి చేత సంతకాలు పెట్టించుకోవడానికి స్టాంప్ పేపర్లను కూడా భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ ల పేరుతో కొన్నట్టుగా పోలీసులు వివరించారు.
వాహనాలకు నంబర్లు మారుస్తూ స్టిక్కర్లు అతికించారని, మొత్తం ప్రణాళికను రచించడంలో భార్గవ్ రామ్ కుటుంబం కూడా కీలక పాత్ర పోషించిందని పోలీసులు తెలిపారు. భార్గవ్ రామ్ తల్లికి, అతడి సోదరుడికి కూడా ఈ ఉదంతంలో భాగస్వామ్యం ఉందన్నారు. ఈ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు భార్గవ్ రామ్. అతడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ కిడ్నాప్ లో పాల్గొన్న వ్యక్తుల్లో చాలా మంది కృష్ణా జిల్లా వారున్నారట. బౌన్సర్లను సరఫరా చేసే ఒక ఏజెన్సీ ద్వారా కిడ్నాపింగ్ కు మనుషులను పురమాయించారట భార్గవ్ రామ్. ఈ ఏజెన్సీతో అఖిలప్రియకు ముందు నుంచి సత్సంబంధాలే ఉన్నాయట. గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వివిధ రకాల కార్యక్రమాలకు ఆ ఏజెన్సీ నుంచినే బౌన్సర్లను పెట్టుకున్నారట. ఇప్పుడు కిడ్నాపింగ్ కు కూడా అక్కడ నుంచినే మనుషులను పురమాయించారట భార్గవ్ రామ్, అఖిలప్రియ.