ఆ కళ మోడీకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు!

‘ఎంతటి ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఒక కళ’..ఆ కళలో ప్రధాని నరేంద్రమోడీ ఘనాపాటి! ఆ విద్యలో ఆయనను తలదన్నేవారు ఇలలో లేనేలేరు! సాధారణంగా ఎవరైనా సరే.. ఏదైనా విజయం…

‘ఎంతటి ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఒక కళ’..ఆ కళలో ప్రధాని నరేంద్రమోడీ ఘనాపాటి! ఆ విద్యలో ఆయనను తలదన్నేవారు ఇలలో లేనేలేరు! సాధారణంగా ఎవరైనా సరే.. ఏదైనా విజయం సాధిస్తే.. ఆ విజయాన్ని పదేపదే చాటుకుంటూ.. దాని ద్వారా తమ కీర్తిని పెంచుకునే వ్యూహరచనతో ఉంటారు. కానీ, ఏమీ సాధించకపోయినా, ఎదురుదెబ్బ తగిలినా, పరాజయమే వరించినా.. వాటిని కూడా తమ కీర్తి పెరగడానికి వాడుకోగలిగే వారు ఒకే ఒక్కరున్నారు.. ఆయనే నరేంద్ర మోడీ.. అనే భావన.. వర్తమాన పరిణామాలను గమనిస్తున్న దేశప్రజలకు కలుగుతోంది. 

పంజాబ్ లో ప్రధాని యాత్ర సందర్భంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏర్పాట్లలో భద్రత వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది. మోడీమీద కక్ష కట్టిన వారు, ద్వేషించేవారు సైతం ఈ మాటను ఒప్పుకుని తీరాల్సిందే. అయితే అది ఏదో హత్యాప్రయత్నం జరిగినట్టుగా చిత్రీకరించదగినది కాదు. 

అక్కడి వైఫల్యాన్ని హత్యాప్రయత్నంగా చిత్రీకరించడం అనేది నిన్నటి మాట. ఆ ఒక్క రాజకీయ విమర్శతో దేశవ్యాప్త మైలేజీ ఎలా వస్తుంది? ఆ విషయాన్ని అందరూ ఒప్పుకునేవారే. ఇక మైలేజీ ఎక్కడిది? అందుకే బీజేపీ కొత్త ధోరణిలో వెళుతోంది. తాజాగా ఇప్పుడు మోడీని మృత్యుంజయుడిగా అభివర్ణిస్తోంది. ఆయన ప్రాణాలకోసం మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తోంది. ఒకచోట కాదు.. దేశవ్యాప్తంగా వేల పట్టణాల్లో.. నగరాల్లో, ఆలయాల్లో!

నిజానికి పంజాబ్ లో రైతుల ప్రతిఘటనను తట్టుకోలేక మోడీ వెనుతిరిగిన వైనాన్ని రాజకీయ మైలేజీకి ఎడ్వాంటేజీగా మార్చుకోవాలని అనుకుంటున్నారు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు పొంచి ఉన్నాయి గనుక.. వారికి తక్షణ మైలేజీ అవసరం. అయితే అయిదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ అంశాన్ని హైలైట్ చేస్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకని.. మోడీ మృత్యుంజయుడు అంటూ.. బిల్డప్ ఇచ్చే వ్యవహారాల్ని దేశానికంతా పులుముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గుడుల్లో మోడీ పేరిట నాయకులు పూజలు చేస్తున్నారు. ఇంకా 13వ తేదీ దాకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలనేది పార్టీ సూచించిన ప్రణాళిక.

అవమానాన్ని కూడా ఎడ్వాంటేజీగా మార్చుకోవడం మోడీకి మాత్రమే తెలిసిన విద్య. గతంలోనూ ‘కాంగ్రెస్ సమావేశాల దగ్గర మోడీని చాయ్ అమ్ముకోడానికి అనుమతిస్తాం’ అని కాంగ్రెస్ నాయకుడు ఎద్దేవా చేస్తే.. మోడీ ఆ ఒక్కమాటతో భయంకరమైన మైలేజీ సృష్టించుకున్నారు. ఊరూరా తిరుగుతూ.. అవును నేను చాయ్ వాలానే.. అని చాటుకుంటూ.. కాంగ్రెస్ మాట్లాడిన తీరు చాలా చీప్ గా ఉందని, ఆ పార్టీ చీప్ రాజకీయాలు చేస్తోందనే భావనను అందరిలో కలిగించారు. 

ఇప్పుడు కూడా అయిదు రాష్ట్రాల ఎన్నికలకు .. పంజాబ్ నుంచి వెనుతిరగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా ముడిపెట్టి లబ్ధి పొందాలనేది ఆయన స్కెచ్. అందులో పార్టీ బాగానే ముందుకు వెళుతోంది.