ప్రధానిని మోహన్‌బాబు ఎందుకు హగ్‌ చేసుకున్నాడు?

ఒకప్పటి కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కుటుంబ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నాడు. వైకాపా నాయకుడైన మోహన్‌బాబును ప్రధాని ఆప్యాయంగా కౌగిలించుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో మీడియాలో కనిపించింది. Advertisement మోహన్‌బాబు…

ఒకప్పటి కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కుటుంబ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నాడు. వైకాపా నాయకుడైన మోహన్‌బాబును ప్రధాని ఆప్యాయంగా కౌగిలించుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో మీడియాలో కనిపించింది.

మోహన్‌బాబు కుటుంబం ప్రధానిని కలుసుకున్న వెంటనే ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్న ట్విట్టర్‌లో 'డైనమిక్‌ ప్రధానిని కలుసుకున్నాం' అని పోస్టు పెట్టింది. ప్రధానిని ఆకాశానికి ఎత్తేసింది. ఒక్కోసారి కొందరు ముఖ్యమంత్రులకు కూడా దొరకని ప్రధాని అపాయింట్‌మెంట్‌ మోహన్‌బాబు కుటుంబానికి దొరికింది. ఇదంతా ఓకే. ఇక మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఆయన్ని ప్రధాని మోదీ 'బీజేపీలో చేరండి' అని స్వయంగా ఆహ్వానించినట్లు వార్తలొచ్చాయి. 

ఇప్పటివరకు బీజేపీలో అనేకమంది ప్రాంతీయ పార్టీ నాయకులు చేరారు. చేరినవారిలో దిగ్గజ నాయకులు ఉన్నారు. వీరంతా రాష్ట్ర నాయకుల ద్వారా రెకమండ్‌ చేయించుకొని అమిత్‌షానో, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ద్వారానో ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరినవారు. కొందరు జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు చేరినవారు. కాని మోహన్‌బాబు ఒక్కడు కాకుండా కుటుంబ సభ్యులతో ఢిల్లీ వెళ్లి ప్రధానిని హగ్‌ చేసుకొని, ఆయన చేతనే  పార్టీలో చేరండి అనిపించుకోవడం నిజంగా విశేషమే. ఈయన తన కాలేజీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమో, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల గురించి మాట్లాడటం కోసమో, ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు వగైరా అడగడం కోసమో ప్రధానిని కలుసుకోడు కదా. 

కాబట్టి బీజేపీలో అడుగుపెట్టడం కోసమే ప్రధానిని కలుసుకొని ఉంటారు. మోహన్‌బాబులో ఉన్నట్లుండి దేశభక్తి పొంగిపొరలిందా? హిందూత్వకు లేదా హిందూయిజానికి విఘాతం కలుగుతోందని బాధపడుతున్నాడా? దేశంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని చూసి మోదీకి అండగా నిలవాలని అనుకున్నారా? చెప్పలేం. బీజేపీలో చేరాలనే ఆలోచన వచ్చి ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. వైకాపాలో ఉన్న మోహన్‌బాబుకు బీజేపీపై ప్రేమ కలిగిందని చెప్పలేం. బహుశా వైకాపాలో ఆయనకు అసంతృప్తిగా ఉండొచ్చు. ఈ విషయం ఇప్పటివరకు బయటికైతే చెప్పలేదు. జగన్‌ ఫ్యామిలీ ఈయనకు బంధువులు కదా. 

మోహన్‌బాబుకు అసంతృప్తి ఉండొచ్చని అంచనా వేయడానికి 'పదవి' కారణంగా కనబడుతోంది. స్థాయిలో చిన్నవారైన కమెడియన్‌ పృథ్వీరాజ్‌కు ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. సీనియర్‌ నటుడు విజయ్‌చందర్‌కు ఫిల్మ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అప్పగించారు. టీటీడీని వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. నిజానికి ఈ మూడు పదవులకు మోహన్‌బాబు అర్హుడే. ఆయన ప్రముఖ నటుడు, నిర్మాతే కాకుండా, భక్తుడు కూడా. ఆయన బీజేపీలోకి వెళ్లాలనుకుంటే అందుకు ఉన్న కారణాల్లో పదవి దక్కలేదనే కారణం కూడా ఉండొచ్చు. మోహన్‌బాబు ఎన్నికలు మరికొద్దిరోజుల్లో ఉండగా వైకాపా కండువా కప్పుకున్నాడు. 

ఏపీ ప్రభుత్వం (చంద్రబాబు సీఎం) తన కళాశాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదంటూ మండిపడి, తన కుమారులతో, విద్యార్థులతో కలిసి తిరుపతిలో ఆందోళన చేశాడు. ఆ వెంటనే నేరుగా లోటస్‌పాండ్‌కు వెళ్లిపోయి జగన్‌ పార్టీలో చేరిపోయాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించలేదని మోహన్‌బాబు రోడ్డెక్కి చేసిన ఆరోపణలకు టీడీపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేత సమాధానం ఇప్పించింది. ఏదో కొద్ది మొత్తం తప్ప ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెద్ద మొత్తంలో బకాయి లేదని, మోహన్‌బాబు ఆరోపణలు అవాస్తవమని కుటుంబరావు మీడియా ముందు లెక్కలు పెట్టారు. 

కాని తనకు పందొమ్మిది కోట్లు ప్రభుత్వం బకాయి ఉందని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడంలేదని మోహన్‌బాబు అప్పట్లో చెప్పాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎవరిది నిజమో, ఎవరిది అబద్దమో పక్కన పెడితే తనకు అండగా ఉండాలంటూ జగన్‌ తనను ఆహ్వానించారని మోహన్‌బాబు చెప్పాడు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అన్నాడు. ఆయన అనుకున్నది జరిగింది. ఇంత చేసిన ఈ కలెక్షన్‌ కింగ్‌ ఇప్పుడు బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నట్లు? జగన్‌ వైపు నుంచి ఏం జరిగింది?