ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరీ ముఖ్యంగా ఈసారి సామాన్య భక్తులకు కూడా ఎక్కువమందికి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనభాగ్యం కల్గిస్తామని టీటీడీ పాలకమండలి ప్రకటించడంతో ఊహించిన దానికంటే భక్తులు ఎక్కువగా పోటెత్తారు. తిరుమలలో నిన్న అర్థరాత్రి నుంచే దర్శనం కోసం వేచిఉండే గదులు నిండిపోయాయి. అర్థరాత్రి 2 గంటల నుంచే వైకుంఠద్వార ప్రవేశం కల్పించిన టీటీడీ.. ఈరోజు అర్థరాత్రి 2 గంటల వరకు వైకుంఠ ద్వారం గుండా సామాన్యులకు దర్శనభాగ్యం కలిగించనుంది.
ముక్కోటి ఏకాదశి కావడంతో తిరుమలకు ప్రముఖల తాకిడి కూడా ఎక్కువైంది. వీళ్లతో పాటు ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి, సురేష్ స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కేటీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, తలసాని, మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఉదయం 9 గంటల నుంచి 2 గంటల పాటు స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీదేవిభూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రథం లాగారు.
క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే గదులు నిండిపోవడంతో.. మాడవీధులు, నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశారు. అవి కూడా నిండిపోవడంతో.. వైకుంఠ ద్వార దర్శన క్యూలైన్లను కల్యాణ వేదిక వైపు మళ్లించారు. ఈ ఒక్క రోజే 3500 మంది శ్రీవారి వాలంటీర్లు సేవలందిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 24 గంటలు రాకపోకలకు అనుమతినిచ్చారు. ఈరోజు ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారో రేపు ఉదయం టీటీడీ ప్రకటిస్తుంది.