హెడ్డింగ్ చూసి అదిరిపోవద్దు. హెడ్డింగ్ చూసి ప్రధాని మోడీని షర్మిల ఎందుకు కలిసి ఉంటారబ్బా అనే రకరకాల ఊహలకు రెక్కలు వచ్చాయా? సీఎం జగన్ చిన్నాన్న కూతురు విరోనిక. ఆమె ప్రముఖ హీరో మంచు విష్ణును ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మంచు మోహన్‌బాబు కోడలన్న మాట. మామ మోహన్‌బాబు, ఆడబిడ్డ లక్ష్మీప్రసన్నతో కలసి ఆమె సోమవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
దాదాపు అరగంటకు పైగా ప్రధానితో మోహన్‌బాబు చర్చలు జరిపినట్టు తెలిసింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు.
సీఎం జగన్‌తో దగ్గరి బంధుత్వం ఉన్న మోహన్‌బాబు ఆకస్మికంగా మోడీని కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. మోహన్‌బాబును బీజేపీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. బీజేపీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.