చింతమనేనికి మరింత రిమాండ్..!

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో ఆ పార్టీ సానుభూతి కోరుతూ ఉంది. ఒకవేళ చింతమనేని వ్యవహారంలోకి లోకేష్ ఇన్ వాల్వ్ కాకపోతే ఆయనకు అంతో ఇంతో ఊరట దక్కేది కాబోలు.…

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో ఆ పార్టీ సానుభూతి కోరుతూ ఉంది. ఒకవేళ చింతమనేని వ్యవహారంలోకి లోకేష్ ఇన్ వాల్వ్ కాకపోతే ఆయనకు అంతో ఇంతో ఊరట దక్కేది కాబోలు. అయితే లోకేష్ వెళ్లి చింతమనేనికి మహాత్ముడు అని సర్టిఫికెట్ ఇవ్వడం, ఆయననో గాంధేయవాదిగా అభివర్ణించడం వంటివి జరగడంతో వ్యవహారం మరింత దూరం వెళ్తున్నట్టుగా ఉంది.

చింతమనేని గాంధీయిజం ఏ స్థాయిలో ఉందో అనేక వీడియోలు కూడా చెప్పాయి. సాక్షాత్ ఒక మంత్రిపై దాడి చేసిన కేసులో చింతమనేని శిక్షను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మంత్రి మీదే దాడి చేసిన వ్యక్తి ఇంకా ఎంతమందిని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాడో వేరే చెప్పనక్కర్లేదు.

తెలుగుదేశం అధికారం కోల్పోయే నాటికే చింతమనేని పై ఉన్న కేసులు యాభై అని తెలుస్తోంది. గత ఐదు నెలల్లో మరో పదహారు కేసుల వరకూ నమోదు అయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదు 
అయినట్టుగా తెలుస్తోంది. ఇలా చింతమనేని స్కోరు డెబ్బైకి రీచ్ అయినట్టుగా ఉంది.

అదలా ఉంటే.. ఈ తెలుగుదేశం నేతకు పోలీస్ రిమాండ్ ను కోర్టు పెంచింది. ఈ నెల ఇరవై వరకూ చింతమనేనికి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. ఇప్పటికే దాదాపు రెండు నెలల నుంచి ఈ టీడీపీ నేత రిమాండ్ లో ఉన్నారు. ఆయనను పోలీసులు జిల్లా కారాగారానికి తరలించారు. అక్కడే మరింత రిమాండ్ సమయాన్ని కోర్టు పొడిగించింది.