ఈ నెల తొమ్మిదో తేదీలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. ఒకవైపు బీజేపీ-శివసేనలు ఒక అంగీకారానికి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. మళ్లీ ఎన్నికలు మాత్రమే శివసేనను భయపెట్టే అంశం. అలాగే కాంగ్రెస్-ఎన్సీపీలు శివసేనతో చేతులు కలపడానికి సిద్ధంగా లేవు. దీంతో బీజేపీతో శివసేన రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే బీజేపీ కూడా పూర్తిగా బెట్టు చేస్తే ఇప్పుడు కాకపోయినా, ముందు ముందు అయినా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు శివసేన బీజేపీకి తలొగ్గినా.. అవకాశం దొరికినప్పుడు అది చాచి కొట్టవచ్చు! అవకాశం చూసి ఏ మధ్యంతరానికో దారి తీయవచ్చు. అందుకే బీజేపీ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గాల్సి ఉంటుందని సలహా! ఈ సలహా ఇస్తున్నది ఎవరో కాదు..ఆర్ఎస్ఎస్ పెద్దలట!
ప్రస్తుత మహా సీఎం ఫడ్నవీస్ తో శివసేనకు ఏ మాత్రం పడటం లేదు. ఫడ్నవీస్ అహంకారంతో వ్యవహరిస్తున్నారనే భావన సేనలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన కాకుండా మరొకరు ముఖ్యమంత్రిగా అయితే శివసేన కూడా తన షరతులను సడలించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అందుకు ఆర్ఎస్ఎస్ కొత్త సీఎం క్యాండిడేట్ ను రెడీ చేసిందని సమాచారం. ఆయన మరెవరో కాదు సంఘ్ ముద్దుబిడ్డ నితిన్ గడ్కరీ. బీజేపీలో చాన్నాళ్లుగా అప్రాధాన్యత పొందుతున్న నేతగా గడ్కరీ పేరు వినిపిస్తూ ఉంది. అయితే ఆయనకు సంఘ్ ఆశీస్సులున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఆయనను మహారాష్ట్ర సీఎంగా చేయాలని సంఘ్ ప్రతిపాదిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆయన అయితే సేనకు కూడా ఆమోదయోగ్యుడు అని సంఘ్ వర్గాలు చెబుతున్నాయట. షరతులను సడలించి శివసేన బేషరతుగా గడ్కరీకి సపోర్ట్ చేస్తుందని, ఐదేళ్లు ప్రభుత్వం సాఫీగా నడవాలంటే గడ్కరీనే తగిన వ్యక్తి అని సంఘ్ ప్రతిపాదిస్తోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ తన శాసనసభా పక్ష నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నఫలంగా గడ్కరీని సీఎంగా తీసుకు రావడానికి ఆ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.