కలల ప్రాజెక్టును బయటకు తీయలేకపోతున్న జగన్!

నవరత్నాల అమలు జగన్ కి పెద్దగా సంతృప్తి ఇచ్చినట్టు లేదు. అంతకుమించి అన్నట్టుగా వివిధ పథకాల పేరుతో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నిధులు జమ చేస్తున్నా జగన్ లో సంతోషం కనపడటం లేదు.  Advertisement…

నవరత్నాల అమలు జగన్ కి పెద్దగా సంతృప్తి ఇచ్చినట్టు లేదు. అంతకుమించి అన్నట్టుగా వివిధ పథకాల పేరుతో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నిధులు జమ చేస్తున్నా జగన్ లో సంతోషం కనపడటం లేదు. 

అసలు తాను అమలు చేస్తున్న పథకాల ఫలితాలు ఏంటి? వాటిపై జనం ఏమనుకుంటున్నారు? ఇంకా తననుంచి ఏం కోరుకుంటున్నారు..? వీటి కోసమే రచ్చబండ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించలేదు. గతంలో రెండుసార్లు ఈ రచ్చబండ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు కరోనా కష్టకాలంకో మరికొన్నాళ్లు వాయిదా పడక తప్పని పరిస్థితి.

రచ్చబండ.. వైఎస్ఆర్ కలల ప్రాజెక్టు..

రచ్చబండ అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్ట్. చివరకు ఆ కార్యక్రమానికి వెళ్తూనే ఆయన ఘోర ప్రమాదానికి గురై తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత దాన్ని వారసత్వంగా ప్రారంభించాలనుకున్నారు ఏపీ సీఎం జగన్. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి నిజంగా జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే జనంలోకి వెళ్లాల్సిందే.

జనం నాడి పట్టి చెప్పాల్సిన మీడియా ఎప్పుడో రెండుగా విడిపోయింది. టీడీపీ అనుకూల మీడియా రాసే వ్యతిరేక ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అదే సమయంలో వైసీపీ అనుకూల మీడియా స్తోత్రాలను కూడా తలకెక్కించుకోకూడదు. అంటే.. నేరుగా నాయకుడే జనంలోకి వెళ్లాలి. దానికి అనువైన కార్యక్రమం రచ్చబండ.

గ్రామస్తులతో కూర్చుని మంచి, చెడులు విశ్లేషించుకోవడం, మరింత మెరుగ్గా పాలన అందించడం దీని లక్ష్యం. అందుకే జగన్ ఆ పని చేయాలని మొదట్నుంచీ అనుకుంటున్నారు కానీ సాధ్యపడటంలేదు.

ఆది నుంచి అడ్డంకులే..

అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లోనే రచ్చబండకు శ్రీకారం చుట్టారు జగన్, కార్యాచరణ కూడా సిద్ధమైంది. తానే అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తానని కూడా ప్రకటించారు. 2019 అక్టోబర్ 2 నాటికి అంతా సిద్ధం అనుకున్న టైమ్ లో కరోనా వచ్చింది. అప్పట్నుంచి రచ్చబండ కార్యక్రమం ఆగిపోయింది. అలా ఆగిన కార్యక్రమం ఇప్పటివరకు మళ్లీ తెరపైకి రాలేదంటే దానికి కారణం కరోనా మాత్రమే.

తాజాగా మరోసారి రచ్చబండకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు జగన్. జిల్లాల పర్యటనలకు కొనసాగింపుగా రచ్చబండను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మూడో వేవ్ భయాల నేపధ్యంలో రచ్చబండను మరికొన్నాళ్లు వాయిదా వేయక తప్పదని సీఎంకు అధికారులు సూచించారు. 

రాబోయే వంద రోజుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఐసీఎంఆర్ చెబుతున్న జాగ్రత్తల్ని గుర్తుచేస్తున్నారు. దీంతో ఈసారి కూడా రచ్చబండ మొదలుకాకుండానే ఆగిపోయింది.