వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్ట్ లు టీడీపీలో రచ్చ లేపాయి. చంద్రబాబు అసమర్థతను మరోసారి తమ్ముళ్లు చీదరించుకుంటున్నారు. జగన్ కి, చంద్రబాబుకి తేడా ఏంటనేది మరోసారి రుజువైందని అంటున్నారు.
వైసీపీ నామినేటెడ్ పోస్ట్ లు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. సంతోషపడేవారున్నట్టే, అలకలు, బుజ్జగింపులు కూడా ఉంటాయి. కానీ ఈసారి వైసీపీ అలకల కంటే టీడీపీ ఆపసోపాలే ఎక్కువయ్యాయి. ఇన్ని పదవులు ఉన్నాయా అంటూ కుళ్లుకుంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు చేసిన మోసాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
బాబు పద్ధతి ఇదీ..
పార్టీ కోసం పనిచేసిన వారికి, పార్టీ గెలుపు కోసం కష్టపడినవారికి 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎలాంటి గుర్తింపు ఇచ్చారో అందరికీ తెలుసు. పార్టీ క్యాషియర్ లా వ్యవహరించిన నారాయణ లాంటి వారిని అనూహ్యంగా తెరపైకి తెచ్చి మంత్రి పదవులిచ్చారు. సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకున్నారు, మహిళల్ని చిన్నచూపు చూశారు.
నిజంగా పార్టీ కోసం కష్టపడి, పార్టీ జెండా భుజాన మోసినవారిని మాత్రం పక్కనపెట్టారు. నామినేటెడ్ పోస్ట్ లు ఇస్తానంటూ చివరి వరకూ ఆశ చూపారు. అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ లు భర్తీ చేసి, కనీసం నెలరోజులైనా నాయకులకు నామినేటెడ్ పదవులు వచ్చిన సంతోషం లేకుండా చేశారు.
జగన్ ఏం చేశారంటే..?
137 నామినేషన్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు పెద్దపీట వేశారు జగన్. పార్టీని నమ్ముకున్నవారికి, పార్టీ గెలుపు కోసం కృషిచేసినవారికి గుర్తింపునిచ్చారు. ఎన్నికల ఏడాదిలో కాకుండా.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేశారు.
సామాజిక సమీకరణాలు కుదరక గత సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినవారికి, గతంలో టీడీపీ నుంచి వైసీపీలో బేషరతుగా చేరినవారికి ఈ పోస్ట్ లు దక్కాయి. అలా పార్టీ నేతలు, కార్యకర్తల్లో జగన్ మరోసారి భరోసా నింపారు.
టీడీపీ నాయకులకు జ్ఞానోదయం..
జగన్ భర్తీ చేసిన నామినేటెడ్ పోస్ట్ లు చూస్తే అసలు ఇన్ని పోస్టులు ఉన్నాయా, ఎన్నికల కోసం పనిచేసినవారిని రెండేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుని ఇలా గౌరవిస్తారా అని అనుకుంటున్నారు టీడీపీ నాయకులు.
వైసీపీలో చేరితే ఎప్పటికైనా భవిష్యత్ ఉంటుందని, ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని, పదవి గ్యారెంటీ అని భావిస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబును తెగ తిట్టుకుంటున్నారు.