అవును. ఇది నిజం. కలలో కూడా ఇలా జరుగుతుందా అనుకున్న వారికి మాత్రం ఇలలోనే జరిగింది. ఇది నిజమని కూడా చాటి చెప్పింది. ఇంతకూ ఏమా అద్భుతం అంటే విశాఖ లాంటి మెగా సిటీలో అతివల చేతికే అధికారం. దానికి అప్పగించిన జగన్ నిజంగా గొప్ప దార్శనీకుడే అంటున్నారు మేధావులు సైతం.
విశాఖ కార్పోరేషన్ ఏపీలోనే పెద్దది. దాదాపుగా వంద వార్డులు ఉన్న జీవీఎంసీకి మేయర్ గా ఒక మహిళను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన జగన్ ఇపుడు అభ్యుదయకాముకులమని గొప్పలు చెప్పుకుని మురిసేవారికి మరో షాక్ ఇచ్చేశారు.
ఉత్తరాంధ్రా సహా అయిదు జిల్లాలకు విస్తరించి ఉన్న వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవిని మరో మహిళకు అప్పగించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి అయిన అక్రమాని విజయనిర్మలని ఈ కీలకమైన పదవికి ఎంపిక చేయడం ద్వారా మహిళలే మహరాణులు అంటూ పెత్తనం మొత్తం వారికే అప్పగించేశారు.
నిజంగా ఈ పదవి కోసం అతిరధ మహారధులు పోటీ పడ్డారు. అయినా జగన్ ఆడవారు ఎవరికి తక్కువ అంటూ సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు. మొత్తానికి తాను మహిళాపక్షపాతిని అని జగన్ రుజువు చేసుకున్నారు అంటున్నారు అంతా.