నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంపై ఆయన ప్రియ శిష్యుడైన ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ ప్రియ శిష్యుల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మొదటి వరుసలో ఉంటారు.
మధు తర్వాతే జగన్‌కు మరెవరైనా అనేంతగా వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిని స్థానికేతరుడైన బీరేంద్రవర్మకు కట్టబెట్టడంపై స్థానిక ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజక వర్గానికి చెందిన బీరేంద్రవర్మ మొదటి నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికొచ్చిన సమయంలో …తన అభిమాన నాయకుడి వెంట బీరేంద్రవర్మ కూడా నడిచారు.
ఆ సమయంలో జెడ్పీటీసీ పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ పట్ల తన విధేయతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిని ఎవరూ ఊహించని విధంగా వర్మకు ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు కె. శ్రీరామమూర్తి, అంజూరి శ్రీనివాసులు, కె.మధుసూదన్‌రెడ్డి తదితరులు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని ఆశించారు.
తన పరిధిలోని ప్రతిష్టాత్మక ఆలయ చైర్మన్‌గా తన నియోజక వర్గానికి చెందిన పార్టీ నేతల్లో ఎవరో ఒకరిని నియమించాలని బియ్యపు మధుసూదన్‌రెడ్డి భావించారని సమాచారం. అయితే తన ఆలోచనలకు భిన్నంగా శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్‌ను నియమించడంపై ఎమ్మెల్యే కాస్త నొచ్చుకున్నట్టు తెలిసింది.
అలాగే స్థానికేతరులకు చైర్మన్ పదవి ఇచ్చి కొత్త సంప్రదాయానికి తెరలేపారనే చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో మరో ప్రతిష్టాత్మక ఆలయమైన కాణిపాకం ఆలయ ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌గా స్థానికేతురాలైన ప్రమీలమ్మరెడ్డిని నియమించడంపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈమె మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి వదిన.
పూతలపట్టు నియోజక వర్గంలోని ఐరాల మండలంలో కాణిపాకం వినాయక ఆలయం ఉంటుంది. కానీ కాణిపాకం ఆలయ ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌గా నియమితులైన ప్రమీలమ్మరెడ్డి గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు పరిధిలోకి వస్తారు. దీంతో పూతలపట్టు ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ నిర్ణయంపై కాసింత అసహనంగా ఉన్నట్టు సమాచారం.