విస్కీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్ ఇది. పురాతనమైన ఓ విస్కీ బాటిల్ ఏకంగా కోటి రూపాయల ధరకు అమ్ముడుపోయింది. అత్యంత పురాతనమైన ఇంగ్లెడ్యూ విస్కీ బ్రాండ్ కు చెందిన ఈ బాటిల్ ను స్కిన్నర్స్ వేలం సంస్థ ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టగా.. కోటి రూపాయల ధరకు అమ్ముడుపోయింది. వేలం పాట నిర్వహకులు ఊహించిన ధర కంటే ఇది 4 రెట్లు ఎక్కువ.
ఈ బాటిల్ పై ఇప్పటికే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా పరిశోధన నిర్వహించింది. ప్రముఖ ఫైనాన్షియర్ జేపీ మోర్గాన్.. మేరీల్యాండ్ కు చెందిన రిడ్ గ్లే ఫ్యామిలీ నుంచి ఈ బాటిల్ తో పాటు మరికొన్ని బాటిల్స్ మద్యాన్ని తీసుకున్నట్టు యూనివర్సిటీ కనిబెట్టింది.
ఆ తర్వాత జేపీ మోర్గాన్ కొడుకు జాక్ మోర్గాన్.. ఈ బాటిల్స్ లో కొన్నింటిని అమెరికా రాజకీయ ప్రముఖులకు బహుమతులుగా ఇచ్చాడు. అలా ఈ విస్కీ బాటిల్స్ అందుకున్న వ్యక్తుల్లో అమెరికా మాజీ అధ్యక్షులు రూజ్ వెల్డ్, హ్యారీ ట్రూమాన్ కూడా ఉన్నారని అధ్యయనంలో తేలింది.
అలా చేతులు మారి చివరికి రెక్స్ ఊల్ బ్రైట్ కుటుంబానికి ఓ విస్కీ బాటిల్ చేరుకుంది. తన తాతకు చెందిన పాత భవనాన్ని రెక్స్ ఖాళీ చేస్తున్నప్పుడు అక్కడ ఈ విస్కీ బాటిల్ ను కనుగొన్నాడు. 1865లో జేపీ మోర్గాన్ ఈ బాటిల్ ను అందించారనే లేబుల్ కూడా దానిపై ఉంది.
మరోవైపు ఈ విస్కీపై కార్బన్ డేటింగ్ పరీక్ష కూడా చేపట్టారు. 1763-1803 మధ్యకాలంలో ఈ విస్కీని తయారుచేసినట్టు పరీక్షల్లో తేలింది. అత్యంత పురాతనమైన విస్కీగా 1845లో తయారుచేసిన ఓ విస్కీ బాటిల్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో ఉంది. ఇప్పుడీ రికార్డ్ ను తాజా విస్కీ బాటిల్ అధిగమించేలా ఉంది.