నారప్ప సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు వెళ్లిపోయింది. దృశ్యం-2 కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అయితే ఇక్కడ విషయం ఇది కాదు. వెంకటేష్ కెరీర్ కు సంబంధించిన మేటర్ ఇది. తన సినిమాలపై వెంకటేష్ సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడా..? అన్న సురేష్ బాబు ప్రభావం ఎక్కువగా ఉందా? తాజాగా వచ్చిన ఈ అన్నదమ్ముల ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఇదే అనుమానం కలుగుతోంది.
ముందుగా వెంకటేష్ విషయానికొద్దాం.. ప్రస్తుతం చేస్తున్న ఎఫ్3 సినిమా తప్పితే, మరో సినిమా గురించి కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు వెంకీ. కనీసం కథాచర్చల్లో ఉందనే విషయాన్ని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు. తరుణ్ భాస్కర్ సినిమా గురించి అడిగితే ఆయనేదో రాస్తున్నాడు తెలియదన్నాడు. ఇక త్రివిక్రమ్ తో సినిమాపై స్పందించడానికి కూడా ఆసక్తి చూపించలేదు. కాంబినేషన్, కథ సెట్ అవ్వాలంటూ తప్పించుకున్నాడు. ఇక చివరిగా ముక్తాయింపు ఇస్తూ “ఏదీ మన చేతిలో లేదమ్మా” అంటూ తేల్చి చెప్పేశారు.
“దగ్గుబాటి కాంపౌండ్ లో ఏదైనా ప్రాజెక్టు ఫైనలైజ్ అవ్వాలంటే సవాలక్ష కండిషన్లు ఉంటాయి. సురేష్ బాబు చెప్పే మార్పుచేర్పులు చేయలేక కిందామీద పడాలి” అనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. అయితే కథల ఎంపికలో వెంకీ తన మార్క్ చూపిస్తాడని, మంచి కథలు ఎంచుకుంటాడని అనుకున్నారంతా. కానీ తాజాగా వెంకటేష్ మాటలు వింటే కథల ఎంపికలో కూడా తన కంటే.. సురేష్ బాబు నిర్ణయాధికారమే ఎక్కువగా ఉందనే విషయం తెలుస్తోంది.
త్రివిక్రమ్ సినిమా అయినా, తరుణ్ భాస్కర్ మూవీ అయినా సురేష్ బాబు ఓకే అంటే, వెంకీ ఓకే అంటాడన్నమాట. లేదంటే లేనట్టే. అటు సురేష్ బాబు మాటలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వెంకీ కోసం ఎవరొచ్చినా తనకు కథ చెబుతారని, మార్పుచేర్పులు చెబుతానని సురేష్ బాబు ఓపెన్ గా ఒప్పుకున్నారు. చివరికి నారప్ప సినిమాకు సంబంధించి కూడా తెరవెనక జరిగిన విషయాన్ని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.
ధనుష్ నటించిన అసురన్ సినిమాను వెంకటేష్ చూశారట. చూసి సురేష్ బాబుకు చెప్పారట. ''నీకు నచ్చితే చేద్దాం'' అన్నయ్య అన్నారట. ఆ తర్వాత సురేష్ బాబు సినిమా చూసి, ఆయనకు కూడా నచ్చడంతో ఓకే చెప్పారట. ఒకవేళ అసురన్ సినిమా సురేష్ బాబుకు నచ్చకపోయి ఉంటే నారప్ప వచ్చి ఉండేది కాదన్నమాట.
వెంకీ ఎక్కువగా రీమేక్ కథలపై ఆధారపడ్డానికి కూడా తెరవెనక ఇదో కారణంగా కనిపిస్తోంది. రీమేక్ సినిమా అయితే సురేష్ బాబును ఒప్పించడం తేలిక. ఆల్రెడీ కళ్లముందు ఉన్న సినిమా కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే.. తనకుతాను సొంతంగా నిర్ణయం తీసుకొని వెంకటేష్ చేసిన సినిమాల్ని వేళ్లపై లెక్కపెట్టొచ్చేమో.
రామ్ చరణ్ కథల్ని చిరంజీవి వింటారు. బన్నీ కథల్ని అల్లు అరవింద్ వింటారు. బెల్లంకొండ శ్రీనివాస్ చేసే సినిమాల కథల్ని అతడి తండ్రి వింటారు. రామ్ దగ్గరకొచ్చే కథల్ని రవికిషోర్ వింటారు. కాబట్టి వెంకటేష్ కోసం వచ్చే కథల్ని సురేష్ బాబు వింటారనే లాజిక్ ఇక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే, వెంకటేష్ సీనియర్ నటుడు. 75 సినిమాలు పూర్తిచేసుకోబోతున్నాడు. ఇప్పటికీ ఇంకా సురేష్ బాబుపై వెంకీ ఆధారపడుతున్నాడనే పచ్చి నిజం అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించేదే.