జ‌బ‌ర్ద‌స్థ్‌కు మించిన కామెడీ

ఈటీవీ చాన‌ల్‌లోనే కాదు…ఈనాడు ప‌త్రిక‌లోనూ జ‌బ‌ర్ద‌స్థ్ లాంటి కామెడీ సీరియ‌ల్ న‌డ‌పాల‌ని రామోజీరావు సంక‌ల్పించిన‌ట్టు … అందులో నేడు ప్ర‌చురించిన ఓ వార్త సంకేతాలిస్తోంది. పాలనావికేంద్రీకరణకు అర్థం తెలుసా? అనే శీర్షిక‌తో ఈనాడులో ప్ర‌ధానంగా…

ఈటీవీ చాన‌ల్‌లోనే కాదు…ఈనాడు ప‌త్రిక‌లోనూ జ‌బ‌ర్ద‌స్థ్ లాంటి కామెడీ సీరియ‌ల్ న‌డ‌పాల‌ని రామోజీరావు సంక‌ల్పించిన‌ట్టు … అందులో నేడు ప్ర‌చురించిన ఓ వార్త సంకేతాలిస్తోంది. పాలనావికేంద్రీకరణకు అర్థం తెలుసా? అనే శీర్షిక‌తో ఈనాడులో ప్ర‌ధానంగా ప్ర‌చురించిన ఇంట‌ర్వ్యూ చ‌దివితే ఎవ‌రికైనా జ‌బ‌ర్ద‌స్థ్ కామెడీ షో గుర్తు వ‌స్తుంది. ఆ ఇంట‌ర్వ్యూ శీర్షిక‌, ఉప శీర్షిక‌లు చ‌దివితే న‌వ్వు ఆపుకోవ‌డం సాధ్యం కాదు.

‘పాలనావికేంద్రీకరణకు అర్థం తెలుసా?’ శీర్షిక‌. అలాగే ఉప శీర్షిక‌లేంటో కూడా త‌ప్ప‌క చ‌దివి తీరాల్సిందే. 

‘సచివాలయం రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి’,‘విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని డిమాండ్‌ ఈనాటిది కాదు’,‘ఈనాడు’ ముఖాముఖిలో సోషలిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు రావెల సోమయ్య అని…క‌థ‌నంలోని సారాంశాన్ని చెప్ప‌క‌నే చెప్పారు.

అస‌లు సోష‌లిస్టు పార్టీ గురించి నేటి జ‌న‌రేష‌న్‌కు తెలుసా? ఆ పేరు విన‌డ‌మే త‌ప్ప‌, రాష్ట్రంలో ఆ పార్టీ యాక్టివిటీస్ గురించి ఎవ‌రైనా, ఎప్పుడైనా విన్నారా? క‌న్నారా? ఆ పార్టీకి చెందిన 86 ఏళ్ల  వృద్ధ నాయ‌కుడు సోమ‌య్య ఇంట‌ర్వ్యూను ప్ర‌చురించ‌డం అంటే….ఈనాడు జ‌బ‌ర్ద‌స్థ్‌కు మించిన కామెడీ చేస్తోంద‌ని అర్థం చేసుకోవాలి.  తుళ్లూరుకు చెందిన సోమయ్య డిగ్రీ చదివే రోజుల్లోనే సోషలిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యారట‌. 1967 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేశారట‌.  

ఆ పెద్దాయ‌న చెప్పిన కొన్ని ఆణిముత్యాల గురించి తెలుసుకుందాం.

‘పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ను ఏర్పాటు చేస్తామనే వారికి అసలు వికేంద్రీకరణకు అర్థమేంటో తెలుసా? ఒకే రాజధాని.. అదీ రాష్ట్రం మధ్యలోనే ఉండాలని, సచివాలయం అక్కడే ఉండాలి’ అని స్పష్టం చేశారు. సోమ‌య్య చెప్పే ప్ర‌కారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉండ‌డానికి వీల్లేదు. దేశానికి మధ్య‌లో ఏ ప్రాంతం ఉందో తేల్చి…అక్క‌డికి దేశ రాజ‌ధానిని వెంట‌నే మార్చాలి.

‘అప్పట్లో (1953) శ్రీబాగ్‌ ఒప్పందం నేపథ్యంలో.. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టడంవల్ల ఈ ప్రాంతానికి అవకాశం తప్పిపోయింది. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయం తీసుకున్నాక… ఈ ప్రాంత ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి కలిసి ఒక మహానగరం అవుతుందని అందరూ ఆశించారు’ అని సోమ‌య్య చెప్పుకొచ్చారు.

అస‌లు త‌మిళ‌నాడు నుంచి విడిపోయి కోస్తా ప్రాంత వాసుల‌తో క‌లిసి వెళ్లేందుకు రాయ‌ల‌సీమ వాసులు ఇష్ట‌ప‌డ‌లేదు. ఉంటే త‌మిళుల‌తో , లేదంటే రాయ‌ల‌సీమ ప్ర‌త్యేక రాష్ట్ర‌మైన డిమాండ్‌తో అప్ప‌టి ఆ ప్రాంత నాయ‌కులు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కానీ తెలుగు వాళ్ల‌కు రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయ‌డం వీలు కాద‌ని, అందువ‌ల్ల శ్రీ‌బాగ్ ఒప్పందం చేసుకుని, ఆ మేర‌కు క‌ర్నూలును రాజ‌ధానిగా అంగీక‌రించ‌డం వ‌ల్లే రాయ‌ల‌సీమ నాయ‌కులు త‌మిళ‌నాడు నుంచి విడిపో యేందుకు అంగీక‌రించారు.

తిరిగి తెలంగాణ‌తో క‌లిసి తెలుగు వాళ్లంద‌రూ ఒక రాష్ట్రంగా ఏర్ప‌డే ద‌శ‌లో హైద‌రాబాద్‌ను రాజ‌ధానిగా నిర్ణ‌యించారు. దీంతో రాయ‌ల‌సీమ వాసులు క‌ర్నూలు రాజ‌ధానిని పోగొట్టుకున్నారు. ఆ త‌ర్వాత 2014లో తిరిగి తెలంగాణ నుంచి విడి పోయి … మ‌రోసారి సీమ వాసులు రాజ‌ధాని న‌ష్ట‌పోయి…కోస్తా వ‌శం చేయాల్సి వ‌చ్చింద‌నే ఆవేద‌న‌తో ఉన్నారు. సీమ వాసుల పుండుపై కారెం చ‌ల్లిన‌ట్టుగా సోమ‌య్య ఇంట‌ర్వ్యూ ఉంది.

‘రాజధాని అంటే సచివాలయమే.  కాబట్టి అది రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి. కేంద్రం అంగీకరిస్తే హైకోర్టును కర్నూలులో పెట్టినా ఫర్వాలేదు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలను విశాఖలో పెడితే, అనంతపురం జిల్లావారు అక్కడికి వెళ్లాలంటే ఎంత కష్టం. కావాలంటే అసెంబ్లీని విశాఖలో పెట్టుకోమనండి. సచివాలయం అమరావతిలోనే ఉండాలి. రాజధానిని తరలించడం లేదని, శాసన రాజధాని ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్లనుకుంటున్నారా?’ అని సోమ‌య్య చెప్పుకొచ్చారు.

ప్ర‌జ‌లు తెలివి త‌క్కువ వాళ్ల‌నుకుంటున్నారా అని ప్ర‌శ్నిస్తున్న పెద్దాయ‌న‌…మ‌రి మిగిలిన ప్రాంత ప్ర‌జ‌లేమైనా తెలివి త‌క్కువ వాళ్లు అనుకుంటున్నారా?  రాజ‌ధాని అంటే సచివాల‌య‌మే అని, అది రాష్ట్రం మ‌ధ్య‌లోనే ఉండాల‌నే లాజిక్ ఏంటి పెద్దాయ‌న‌? మ‌రి త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై…ఆ రాష్ట్రానికి మ‌ధ్య‌లో లేదే. మ‌రి ఇప్పుడు ఏం చేద్దామంటారు? అలాగే దేశ రాజ‌ధాని కూడా మ‌ధ్య‌లో లేదే? మ‌రిప్పుడు ఏం చేయాలంటారు? ఇలాంటి మాట‌లు మ‌రెవ‌రికైనా చెబితే బాగుంటుందేమో! తెలివేమీ ఆ 29 గ్రామాల సొంతం కాద‌నే విష‌యాన్ని గ్ర‌హించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి కామెడీ మాట‌లు.

కావాలంటే విశాఖ‌లో అసెంబ్లీని పెట్టుకోవాల‌ని చెబుతారా? ఏం రాజ‌ధాని అంటే మీరు వేసే భిక్ష అనుకుంటున్నారా? స‌చివా ల‌యం అమరావ‌తిలోనే ఉండాల‌నే ఆ ఆదేశాలు, ద‌బాయింపు…మిగిలిన ప్రాంత ప్ర‌జ‌ల్ని అవ‌మానించ‌డం కాదా? ఇలాంటి ఇంట‌ర్వ్యూ ప్ర‌చురించ‌డం అంటే…ఆ 29 గ్రామాలు మిన‌హా మిగిలిన ప్రాంతాల మ‌నోభావాల‌ను అవ‌హేళ‌న చేయ‌డం కాదా?

‘రాజధానిని మారుస్తామని చెబుతుంటే ప్రజలు ఎందుకు మిన్నకుంటున్నారో అర్థం కాదు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలూ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది’…చివ‌రిగా సోమ‌య్య నోటి నుంచి అస‌లు నిజాలు బ‌య‌టికొచ్చాయి.

నిజంగా అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాల‌నే ఆకాంక్ష రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఉంటే…మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఎందుకు ఉద్య‌మించ‌రు? ఈ మాత్రం కామ‌న్‌సెన్స్ లేకుండా ఏక‌ప‌క్ష రాత‌లు ఇంకెంత కాలం? ఇలాంటి రాత‌ల‌తోనే ఇప్ప‌టికే ఈనాడు రీడ‌ర్‌షిప్‌లోనూ, స‌ర్క్యులేష‌న్‌లోనూ భారీగా ప‌డిపోయింద‌ని అనేక నివేదిక‌లు చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ త‌న వైఖ‌రి మార్చుకోకుండా…అలాగే కొన‌సాగ‌డం అంటే, త‌న కంటిని త‌న వేళ్ల‌తోనే పొడుచుకోవ‌డం కాదా?

ప్రస్తుతం ఒక ట్రాప్ లో ఉన్నాను

యధా మోడీ..తథా పవన్