ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమెరికాలో కోవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ను మొదలుపెట్టనున్నారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ఇచ్చింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసిందని, నవంబర్ ఒకటి నుంచి కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని సూచించిందని ఆ కథనంలో పేర్కొన్నారు. కరోనాకు విరుగుడు వ్యాక్సినే అని ట్రంప్ సర్కార్ బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో అదిగో..ఇదిగో అనే ప్రకటనలు చేస్తూ వచ్చింది.
వ్యాక్సిన్ తయారీ సంస్థలతో అమెరికన్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటూ వచ్చింది. వాటి ట్రయల్స్ కూడా పూర్తి కాకుండానే.. అమెరికన్ ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. మూడో దశ ట్రయల్స్ కు చేరుకున్న వివిధ సంస్థలతో అమెరికన్ ప్రభుత్వం కోట్ల డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ వ్యాక్సిన్ లు విజయవంతం అయితే వాటి ఉత్పత్తి అంతా తమకే దక్కేలా అమెరికా ఆ ఒప్పందాలు చేసుకుంది. 30 కోట్ల పై స్థాయి జనాభా ఉన్న అమెరికా.. ఏకంగా 80 కోట్ల డోసేజ్ లకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చి , డబ్బులు కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది.
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా, యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారంతో తయారవుతున్న మోడెర్నా, ఫైజర్ సంస్థలతో అమెరికా ఒప్పందాలు చేసుకున్నట్టుగా సమాచారం.
ఈ వ్యాక్సిన్ లు ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వేల సంఖ్య లో వలంటీర్ల మీద వీటిని ప్రయోగిస్తున్నారు. అక్టోబర్ నాటికే తమ వ్యాక్సిన్ లు అందుబాటులోకి వస్తాయని వీటి తయారీ దారులు ప్రకటించారు. బహుశా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ అక్టోబర్ నాటికే పూర్తి అవుతాయి. భారీ స్థాయిలో ఉత్పత్తికి కూడా ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారట. ఈ నేపథ్యంలో నవంబర్ నాటికి అమెరికాకు ఈ సంస్థలు వ్యాక్సిన్ ను అందించేలా ఉన్నాయి.
అమెరికాలో కూడా ముందుగా కరోనా పోరులో ముందు వరసలో ఉన్న సిబ్బందికి, నేషనల్ సెక్యూరిటీ సిబ్బందికి, సీనియర్ సిటిజన్స్ కు ఇవ్వనున్నారట. కేవలం ఒక దశ వ్యాక్సినేషన్ మాత్రమే కాకుండా రెండోసారి బూస్టర్ డోస్ కూడా ఇవ్వనున్నారట. నవంబర్ ఒకటి నుంచి వ్యాక్సిన్ ఈ రకంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే అమెరికన్ ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నవంబర్ మూడున అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అంతకు రెండు రోజులకు ముందే అమెరికాలో కరోనా విరుగుడు వ్యాక్సిన్ పడనుందని పేర్కొంది.