సభ్యసమాజం తలదించుకునే మరో ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల్లో తమ్ముడ్ని పెళ్లి చేసుకున్న మహిళ, అతడి అన్నపై కోరిక పెంచుకుంది. ఈ వివాహేతర సంబంధం కాస్తా హత్యకు దారితీసింది. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఎవరిది అనే కోణంలో పోలీసులు విచారణ జరిపితే, ఈ అక్రమ సంబంధం బయటపడింది.
మంగళగిరి దగ్గర్లో ఉన్న నవులూరు గ్రామంలో సీతారామాంజనేయులు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతడికి లక్ష్మితో కొన్నేళ్ల కిందట పెళ్లయింది. అయితే పెళ్లయిన కొన్ని రోజులకే లక్ష్మి.. భర్త అన్నయ్య దుర్గాప్రసన్నపై ఇష్టం పెంచుకుంది. దీంతో లక్ష్మి-దుర్గాప్రసన్న మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న సీతారామాంజనేయులు భార్యను నిలదీశాడు. అన్నతో గొడవ పెట్టుకున్నాడు. విషయం బయటపడ్డంతో.. ఇక సీతారామాంజనేయుల్ని అడ్డు తొలిగించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ నేరచరిత్ర ఉన్న దుర్గాప్రసన్న.. తమ్ముడి హత్య చేయడానికే ఫిక్స్ అయ్యాడు.
గత నెల 21న రాత్రి వేళ స్టేడియం వద్ద ఆటోతో ఉన్న సీతారామాంజనేయులి వద్దకు అతడి భార్య, అన్న వచ్చారు. బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. గొంతు నులిమి చంపేశారు. ఈ హత్యకు దుర్గాప్రసన్న స్నేహితులు మరో ఇద్దరు సహకరించారు.
ఘటన జరిగిన కొన్ని రోజులకు స్టేడియం సమీపంలోని పొదల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. మృతదేహం వద్ద దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. ప్రస్తుతం లక్ష్మి, దుర్గాప్రసన్న, అతడి ఇద్దరు స్నేహితులు పోలీసు కస్టడీలో ఉన్నారు.