మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఏడాది పూజలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో ఆయన మొహంలో వెలుగు కనిపిస్తోంది. ఓటమి తర్వాత మొదటి సారి ఆయనకు ఆనందం ఇచ్చిన విషయం ఇది. భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించే అనుభూతి మిగిల్చిన ఫోన్ కాల్. మళ్లీ మళ్లీ అలాంటి రోజు రావాలని బాబు కోరుకుంటున్నారు.
కేంద్రహోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడే అపూర్వ అవకాశం కలిగింది. బుధవారం ఆయన అమిత్‌షాతో ఫోన్లో మాటామంతీ కలిపారు. అసలు ప్రధాని మోడీ, అమిత్‌షాలతో మాట్లాడే అవకాశం ఇక ఎన్నటికీ రాదనుకుంటున్న తరుణంలో….ఆ అద్భుత అవకాశాన్ని కల్పించిన కరోనాకు ఎన్నిసార్లు దండం పెట్టుకున్నా రుణం తీరదని బాబు పదేపదే మనసులో అనుకుని ఉంటారు.
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని చంద్రబాబునాయుడు ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్యంపై బాబు ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మోడీ, అమిత్‌షాలను ప్రసన్నం చేసుకునేందుకు ఏడాదిగా బాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏదో ఒక సాకుతో వాళ్ల అపాయింట్మెంట్ అడిగినా పట్టించుకున్న పాపాన పోలేదు.
ఎలాగైనా బీజేపీతో రాజకీయంగా కలిసి ప్రయాణించాలని చంద్రబాబు తహతహలాడుతున్న విషయం తెలిసిందే. అయితే బాబు వెంపర్లాటను మొగ్గదశలోనే బీజేపీ తుంచివేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ… పవన్క ల్యాణ్ నేతృత్వం వహిస్తున్న జనసేనానితో కలిసి ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అమిత్‌షాను పరామర్శించడం కలిసొస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.