ప్రజలారా పోరాడండి.. పోరాడితే పోయేదేమీ లేదు.. రోడ్ల పైకి రండి.. అంటూ అమరావతి విషయంలో హడావిడి చేసిన చంద్రబాబుకి ఇప్పుడు పూర్తిస్థాయిలో జ్ఞానోదయం అయినట్టుంది. అమరావతిపై తాడోపేడో తేల్చుకుంటాం, రాజీనామాలు చేసి బరిలో దిగండి అంటూ సవాళ్లు విసిరిన చంద్రబాబులో ఇప్పుడా వేడి ఆవిరైపోయింది. ఈ వ్యవహారంతో తను పూర్తిగా కార్నర్ అయిపోయానని కొన్ని రోజుల కిందటే అర్థమైంది.
అందుకే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన చంద్రబాబు పార్టీ నేతల్ని కలిశారే కానీ, జాతీయ సమస్య అని ప్రచారం చేసుకుంటున్న అమరావతి వైపు కన్నెత్తి చూడలేదు. అసలు బాబు షెడ్యూల్ లో అమరావతి రైతుల పరామర్శ లేనే లేదు. అమరావతి ఉద్యమం 250వ రోజుకి చేరిన రోజే ఆయన ఓ ట్వీట్ వేసి సరిపెట్టారు. అప్పట్లోనే బాబు వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని అంతా ఫిక్స్ అయిపోయారు.
ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రాష్ట్రంలో అడుగు పెట్టిన చంద్రబాబు అమరావతి రైతుల్ని కాకుండా తన నాయకుల్ని మాత్రమే ఎందుకు కలుసుకున్నారు? రాష్ట్రంలో అన్ని సమస్యలపై మాట్లాడిన బాబు, రాజధాని విషయాన్ని ఎందుకు పక్కనపెట్టారు? కనీసం అమరావతి రైతులకైనా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? రెచ్చగొట్టి వదిలేశారా?
ఈ విషయాన్ని కొంతమంది బాబు ముందు ప్రస్తావించినా ఆయన స్పందించడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. అమరావతి విషయంలో ఆయన పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారని, ఇకపై దాన్ని పట్టుకుని వేలాడటం కుదరని పని అన్నారని సమాచారం. అమరావతి వ్యవహారంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ బలహీనపడుతుందనే వాదన కూడా ఉంది.
ఈ సమీకరణాలన్నీ బేరీజు వేసుకుని రాజధాని విషయంలో నోరు కట్టేసుకుంటున్నారు చంద్రబాబు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కానీ, సందర్భం లేకపోయినా సవాళ్లు విసరడం ఆపేశారు.