ఈస్ట్ ఢిల్లీ ప్రిమియర్ లీగ్ ను ప్రారంభించాడు మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్. ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం ఎంపీనే ఇతడు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గం పరిధిలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను గంభీర్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ లీగ్ ప్రైజ్ మనీని 30 లక్షలుగా పెట్టారు.
రన్నరప్ కు ఇరవై లక్షల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇతర స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. ఈ లోక్ సభ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒక జట్టును ఎంట్రీగా పిలిచారు. ఆ జట్ల మధ్యన ఇరవై రోజుల పాటు వివిధ స్థాయిల్లో పోటీలు నిర్వహించి ఈ లీగ్ కు ఛాంపియన్ ను తేల్చనున్నారు.
మ్యాచ్ లను యూట్యూబ్ లో లైవ్ లో పెట్టడంతో పాటు, దీని కోసం ఒక యాప్ ను ప్రారంభించారట! ఇలా మాజీ క్రికెటర్ అయిన రాజకీయ నేత, తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఒక క్రికెట్ లీగ్ ను ప్రారంభించడం ప్రయోగాత్మకం అనే అనుకోవాలి. క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎంపీలు అయ్యి సాధిస్తున్నది ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ తన వంతుగా తన నియోజకవర్గంలోని యువతను ఆకట్టుకునేలా ఒక క్రికెట్ లీగ్ కు శ్రీకారం చుట్టాడు.
అది కూడా మంచి స్థాయిలో ప్రైజ్ మనీ నేపథ్యంలో.. ఈ లీగ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అలాగే నాణ్యమైన క్రికెట్ ప్లేయర్లకు కూడా దేశ రాజధాని ప్రాంతం పెట్టింది పేరు. ఇలాంటి నేపథ్యంలో.. గంభీర్ నిర్వహిస్తున్న ఈ లీగ్ ద్వారా ఎవరైనా కుర్ర ప్లేయర్లు వెలుగులోకి వస్తే మంచిదే.
రంజీ లెవల్ స్టాండర్డ్స్ తో ఈ మ్యాచ్ లను నిర్వహిస్తారట. ఇక దేశంలోని ఇతర ఎంపీలు కూడా ఈ తరహా కార్యక్రమాల మీద దృష్టి నిలపవచ్చు. తమ తమ నియోజకవర్గాల పరిధిలోని స్పోర్ట్స్ టాలెంట్ ను కూడా వెలుగులోకి తీసుకు వచ్చే బాధ్యతను వారు ఈ రకంగా స్వీకరించవచ్చు కూడా! కేవలం క్రికెట్ అనే కాదు.. ఇతర క్రీడలనూ ఈ తరహాలో పరిగణనలోకి తీసుకుంటే చాలా మంచి పనే అవుతుంది. అయితే గంభీర్ అంటే మాజీ క్రికెటర్ కాబట్టి.. ఇలాంటి టోర్నీల నిర్వహణకు స్పాన్సర్ ను పట్టడం పెద్ద కష్టం కాదేమో.
అది కూడా నగర స్థాయి నియోజకవర్గం కాబట్టి.. స్పాన్సర్లు సులభంగానే లభిస్తారు. కోటి రూపాయలకు పైనే ఖర్చు పెట్టి కూడా.. ఇలాంటి లీగ్ ను నిర్వహించడం పెద్ద పనేం కాదు. ఇతర ఎంపీలకూ, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లోని ఎంపీలకు ఇలాంటివి తేలిక కాదు. గంభీర్ చేయగలుగుతున్నాడు. ఇలాంటి వారైనా ఆ బాధ్యత తీసుకోవడం ఆహ్వానించదగిన అంశం.