పెళ్లికి ఒప్పుకోకపోతే ప్రియురాలిపై యాసిడ్ పోసే ప్రియుడి స్టోరీలు చాలానే ఉన్నాయి. అదే ప్రియుడు మొహం చాటేస్తే.. అతని ఇంటి ముందు ప్రేయసి ధర్నా చేయడం, దీక్ష చేయడం, రివర్స్ లో దాడి చేయడం వంటి సంఘటనలు కూడా అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి రివర్స్ కేసులకే ఇది రివర్స్ కేసు. ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని అతడిపై కక్ష పెంచుకుంది ఓ ప్రియురాలు. తన ప్రియుడు చేసుకోబోయే యువతిపై కత్తితో దాడి చేసింది.
మాజీ ప్రియురాలి దాడిలో గాయపడిన తాజా ప్రియురాలు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్రేమ దాడిలో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఇద్దరు ప్రేమికురాళ్లు స్నేహితులే.
ఆయనకిద్దరు..
ఈ ప్రేమకథ కర్నాటకలోని శిడ్లఘట్ట తాలూకా మడుగు అనే గ్రామంలో మొదలైంది. ఆ గ్రామానికి చెందిన గంగోత్రి, మౌనిక స్నేహితులు. వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. వీరిద్దరికీ గంగరాజు అనే కామన్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అయితే గంగరాజు దేశముదురు. ఒకరికి తెలియకుండా ఒకరిని లవ్ లోకి దించాడు. అటు గంగోత్రికి ప్రేమ కబుర్లు చెప్పేవాడు, ఇటు మౌనికను కూడా ముగ్గులోకి దించాడు. ఇద్దరూ వాడిని గుడ్డిగా నమ్మారు. పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యారు.
తీరా గంగరాజు ఇంట్లో విషయం తెలిసింది. గంగరాజు, మౌనిక ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వారి పెళ్లికి పెద్దవారు అంగీకరించారు. ఇంకేముంది మౌనికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, గంగోత్రిని పక్కనపెట్టాడు గంగరాజు. దీంతో గంగోత్రి రగిలిపోయింది. గంగరాజు తనకి దక్కకపోవడానికి కారణం మౌనికేనని భావించింది. ఆమెపై కక్షపెంచుకుంది. స్నేహితురాలు అనే కనికరం కూడా లేకుండా ఆమెపై కత్తితో దాడి చేసింది.
గంగోత్రి దాడిలో మౌనిక చేతికి, మెడకు గాయాలయ్యాయి. ఆమెను ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గంగోత్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.