మున్సిపాలిటీల్లో పోటా పోటీ జిల్లా అదే!

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల అధికార పార్టీ హ‌వా క‌నిపిస్తూ ఉంది. భారీ ఎత్తున ఏక‌గ్రీవాలు కూడా చోటు చేసుకున్నాయి. వాస్త‌వానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎదురైన ఓట‌మిని బ‌ట్టి చూస్తూ ఈ స్థాయిలో…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల అధికార పార్టీ హ‌వా క‌నిపిస్తూ ఉంది. భారీ ఎత్తున ఏక‌గ్రీవాలు కూడా చోటు చేసుకున్నాయి. వాస్త‌వానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎదురైన ఓట‌మిని బ‌ట్టి చూస్తూ ఈ స్థాయిలో ఏక‌గ్రీవాలు న‌మోదు కావ‌డం పెద్ద విడ్డూరం కాదు. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో చిత్త‌య్యిందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అది మామూలు ఓట‌మి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు భారీ నుంచి అతి భారీ మెజారిటీ సాధించారు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో. ముప్పై వేల‌కు పైగా మెజారిటీ అంటేనే భారీ మెజారిటీ.  అలాంటిది అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థులు 30 వేలు, 40 వేలు, 50 వేల స్థాయి మెజారిటీలు కూడా న‌మోదు చేశారు! అది కూడా అంత వ‌ర‌కూ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చిన ఫ‌లితాలు అవి.

అయితే ఆ ఫ‌లితాలన్నీ వ‌చ్చి రెండేళ్లు గ‌డిచిపోయాయి, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కోలుకోలేదు. దానికి అనేక కార‌ణాలు. ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కే కాదు, పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య‌కు కూడా రాని ప‌రిస్థితి నెల‌కొంది. క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో గ‌త ఏడాది కాలంగా చంద్ర‌బాబు ఏపీ వైపు తొంగి చూడ‌లేదు. హైద‌రాబాద్ లోని త‌న నివాసానికే ప‌రిమితం అయ్యారు. జూమ్ మీటింగుల్లో ఎంత వాయించినా.. అనుకూల మీడియాలో రాసుకోవ‌డానికే అది ప‌రిమితం అవుతుంది త‌ప్ప మ‌రో ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఇలా ప్ర‌జ‌ల‌తో చంద్ర‌బాబు నాయుడుకు దూరం పూర్తిగా పెరిగింది.

గ‌డిచిన రెండేళ్ల కాలంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మ‌క‌మైన పోరాటాలు ఏవీ చేయ‌లేదు. సీఎం వైఎస్ జ‌గ‌న్ పై అడ్డ‌గోలుగా మాట్లాడ‌ట‌మే ప్ర‌తిప‌క్షంగా త‌మ ప‌ని అన్న‌ట్టుగా టీడీపీ త‌యారైంది. చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ బూతులు మాట్లాడే వ‌ర‌కూ వ‌చ్చారు. బూతులు మాట్లాడితే ఓట్లు ప‌డ‌తాయ‌ని అనుకోవ‌డం వారి భ్ర‌మ త‌ప్ప మ‌రోటి కాద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు ఏమాత్రం యాక్టివ్ గా లేరు. ద‌శాబ్దాల పాటు ఎమ్మెల్యేలుగా చ‌లామ‌ణి అయిన వారు, టీడీపీ హ‌యాంలో అధికారాన్ని వెల‌గ‌బెట్టిన వారు కూడా.. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మి త‌ర్వాత కిక్కుర‌మ‌న‌కుండా ఉన్నారు. ఈ ప‌రిస్థితుల్లో.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి తాడూబొంగ‌రం లేకుండా పోయింది. ఎన్నిక‌లు అంటేనే ఖ‌ర్చు. క‌నీసం కొంతైనా ఖ‌ర్చు పెట్టుకుంటేనే ఎవ‌రైనా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌గ‌ల‌రు. అవి పంచాయ‌తీ ఎన్నిక‌లు అయినా, మున్సిప‌ల్ ఎన్నిక‌లు అయినా ఒక‌టే!

అధికారం ఉన్న‌ప్ప‌డు టీడీపీ నేత‌ల సంపాద‌న‌ల‌కు లోటు లేదు. ఎమ్మెల్యేల ద‌గ్గ‌ర నుంచి జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యుల వ‌ర‌కూ ఎవ్వ‌రి స్థాయిలో వారు దండుకున్నారు. నీరూ-చెట్టూ ఒక‌టి చాలు.. నాడు వీరి సంపాద‌న‌లు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్ప‌డానికి! అలా దండుకున్న వారు కూడా ఇప్పుడు ధైర్యంగా ముందుకు రావ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఈ ప‌రిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీకి ఒక‌ప్ప‌టి కంచుకోట‌గా ఉండిన రాయ‌ల‌సీమ‌లోని ప‌లు నియోజ‌క‌ర్గాల్లో కూడా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ క‌నీసం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ఆ పై జ‌గ‌న్ మార్కు సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై గ‌ట్టిగా ఉంది. దీంతో కొన్ని చోట్ల టీడీపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను పెట్టినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది! పోటీ జ‌రిగినా, పోటీ జ‌ర‌గ‌క‌పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేక‌పోయింది.

ఇంత‌లోనే మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ప‌ల్లెల్లో బేల‌గా ఉన్న టీడీపీ ప‌ట్టణాల‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. అయిన‌ప్ప‌టికీ చాలా చోట్ల మ‌ళ్లీ ఏక‌గ్రీవాలే. తెలుగుదేశం పార్టీకి స‌రైన ఇన్ చార్జిలు లేకుండా పోయిన చోట పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వార్డుల‌కు నామినేష‌న్లు వేసే దిక్కు లేకుండా పోయింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక‌టీ రెండు జిల్లాల్లో మాత్రం టీడీపీ గ‌ట్టి పోటీ ఇస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున రికార్డు స్థాయి నామినేష‌న్లు ప‌డ్డ జిల్లా ఒక‌టి ఉంది. అదే అనంత‌పురం.

ఈ జిల్లాలోనే అత్య‌ల్ప స్థాయిలో ఏక‌గ్రీవాలు న‌మోద‌య్యాయి. అనంత‌పురం కార్పొరేష‌న్ లో అయితే.. ఒక్క ఏక‌గ్రీవం కూడా లేదు. మొత్తం 50 డివిజ‌న్ల‌లోనూ ఇక్క‌డ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. టీడీపీ 44 డివిజ‌న్ల‌లో పోటీలో ఉంది. ఆరు డివిజ‌న్ల‌లో మాత్రం ఆ పార్టీకి అభ్య‌ర్థులు దొరికిన‌ట్టుగా లేరు. ఇక ఇదే కార్పొరేష‌న్ల‌లో బీజేపీ-జ‌న‌సేన‌లు 28 డివిజ‌న్ల‌లో పోటీలో ఉన్నాయి. అనంత‌పురం అర్బ‌న్ అన్ని కులాల కల‌బోత‌లా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ అన్ని డివిజ‌న్ల‌లోనూ పోలింగ్ జ‌ర‌గ‌బోతూ ఉండ‌టం ప్ర‌జాభిప్రాయం స్ప‌ష్టంగా బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది.

ఇక అనంత‌పురం జిల్లా ప‌రిధిలోని హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డుల‌కు గానూ అన్ని వార్డుల్లోనూ టీడీపీ- వైఎస్ఆర్సీపీ పోటీలో ఉన్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో టీడీపీ చిత్త‌య్యింది. టౌన్లో మాత్రం అభ్య‌ర్థుల‌ను పెట్టుకోగ‌లిగింది.

తాడిప‌త్రి మున్సిపాలిటీలో కూడా టీడీపీ దాదాపు అన్ని వార్డుల్లోనూ పోటీలో ఉంది. క‌దిరి, పుట్ట‌ప‌ర్తి, క‌ల్యాణ‌దుర్గం, గుంత‌క‌ల్, గుత్తి మున్సిపాలిటీల్లో కూడా తెలుగుదేశం దాదాపు ప్ర‌తి వార్డుకూ అభ్య‌ర్థిని పెట్టుకోగ‌లిగింది.

బీజేపీ-జ‌న‌సేన‌లు నామ‌మాత్ర‌పు పోటీలో ఉన్నాయి. ప‌రిమిత సంఖ్య‌లో వార్డుల‌కు మాత్ర‌మే ఈ పార్టీలు నామినేష‌న్లు వేయ‌గ‌లిగాయి.

ప్ర‌ధాన పోటీదారులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- టీడీపీలున్నాయి. స్థూలంగా ఈ జిల్లాలోనే ఏక‌గ్రీవాల సంఖ్య ప‌రిమిత స్థాయిలో ఉంది. ఒక‌ప్ప‌టి టీడీపీ కంచుకోట కావ‌డంతో ఈ జిల్లాలో ప‌ట్ట‌ణాల్లో ఇప్పుడు టీడీపీకి కనీసం నామినేష‌న్లు ప‌డ్డాయి. ప‌ల్లెల్లో టీడీపీ ఉనికి కోల్పోగా.. ప‌ట్ట‌ణాల్లో మాత్రం కాస్త ఉనికి ఉంద‌నే సంకేతాల‌ను ఇస్తున్నాయి ఈ నామినేష‌న్లు. మ‌రి నామినేష‌న్లు ప‌డ‌ట‌మే టీడీపీ పాలిట పెద్ద విజ‌యం. ఇక పుర‌ ప్ర‌జాభిప్రాయం ఎలా ఉంటుందో.. అనంత‌పురం జిల్లా మున్సిపోల్స్ ఫ‌లితాల‌ను బ‌ట్టి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌నుంది!