ఎక్కడైనా భార్య తప్పుచేస్తుంది. లేదంటే భర్త తప్పు చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం భార్యాభర్తలు కలిసి ఓ హత్య చేశారు. డబ్బుకు ఆశపడి నేరం చేసి పోలీసులకు చిక్కారు. వికారాబాద్ జిల్లా బంటారం మండలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దానికి కారణం ఈ భార్యాభర్తలే. వివరాల్లోకి వెళ్దాం..
నాగర్ కర్నూల్ కు చెందిన 28 ఏళ్ల చెన్నమ్మ చేవెళ్లకు జీవనోపాధి కోసం వచ్చింది. ఈమెకు రాజు, ఆయన భార్య అనీతో పరిచయం ఏర్పడింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న టైమ్ లో రాజు-అనీకి ఆర్థిక సమస్యలు వచ్చాయి. దాని కోసం వాళ్లు అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. చెన్నమ్మ వద్ద బంగారం ఉన్న విషయాన్ని తెలుసుకున్నారు.
చెన్నమ్మకు మాయమాటలు చెప్పి తన బైక్ పై ఎక్కించుకొని బోనాపురం గ్రామ శివార్లకు తీసుకెళ్లారు రాజు-అనీ. ముగ్గురూ కలిసి మందుకొట్టారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, దంపతులిద్దరూ తక్కువ మద్యం సేవించి, చెన్నమ్మకు మాత్రం బాగా మద్యం తాగించారు. మైకంలో ఉన్న చెన్నమ్మ గొంతునులిమి చంపేశాడు రాజు. పక్కనే ఉన్న పొదల్లో శవాన్ని పడేసి తగులబెట్టాడు.
అక్క కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు చెన్నమ్మ తమ్ముడు. రంగంలోకి దిగిన పోలీసులు రాజు-అనీలను అనుమానించారు. తమదైన శైలిలో విచారణ జరపగా నిజం బయటపడింది. చెన్నమ్మను బంగారం కోసం తామే హత్య చేశామని భార్యాభర్తలిద్దరూ అంగీకరించారు. అలా చనిపోయిన 20 రోజుల తర్వాత చెన్నమ్మ ఆచూకీని కనుగొన్నారు.