వైసీపీలో చేర‌కుండానే ఎమ్మెల్సీ ప‌ద‌వా?

స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా మాజీ మంత్రి మురుగుడు హ‌నుమంత‌రావును ఎంపిక చేయ‌డంపై వైసీపీ శ్రేణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఆయ‌న టీడీపీకి రాజీనామా చేశారు. అనంత‌రం…

స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా మాజీ మంత్రి మురుగుడు హ‌నుమంత‌రావును ఎంపిక చేయ‌డంపై వైసీపీ శ్రేణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఆయ‌న టీడీపీకి రాజీనామా చేశారు. అనంత‌రం వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న స‌న్నిహితంగా మెలుగుతున్నారు. కానీ ఆయ‌న ఇంకా వైసీపీలో చేర‌లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

గుంటూరు జిల్లాలో మురుగుడు హ‌నుమంత‌రావు చేనేత వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన బీసీ నేత‌. 1999, 2004లో మంగ‌ళ‌గిరి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేశారు. 2014లో ఆయ‌న టీడీపీలో చేరారు. ఆప్కో చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో రాజ‌కీయంగా ఆయ‌న మౌనంగా ఉంటూ వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో నెల‌న్న‌ర క్రితం త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వ‌లేదంటూ టీడీపీని వీడారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంగ‌ళ‌గిరిలో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ నారా లోకేశ్‌పై ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని గెలిపిస్తే… ఇక్క‌డి చేనేతల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.  

ఈ హామీ హ‌నుమంత‌రావుకు క‌లిసొచ్చింది. అయితే ఆయ‌న ఇంకా పార్టీలో చేర‌కుండానే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చార‌నే చ‌ర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. దీనిపై అధికార పార్టీ స‌మాధానం ఏంటో తెలియాల్సి వుంది.