ఉపయెన్నికల ఫలితాలలో బిజెపి యిమేజిని బాగా దెబ్బ తీసిన రాష్ట్రం అది అధికారంలో వున్న హిమాచల్ ప్రదేశ్, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా సొంత రాష్ట్రం! అంతేకాదు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా! పైగా 2022 చివర్లో దానికి ఎన్నికలున్నాయి. హిమాచల్‌లో ఓ సారి కాంగ్రెసు గెలిస్తే, మరోసారి బిజెపి గెలుస్తూ వస్తోంది.
ఏ ప్రభుత్వమైనా కానీ మూడు, నాలుగు ఏళ్లు గడిచేసరికి ప్రభుత్వ వ్యతిరేకత గూడుకట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెసు పూర్తిగా క్షీణించిన యీ తరుణంలో కూడా అక్కడ విజయకేతనాన్ని ఎగరవేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్టోబరు 30న మండీ లోకసభ స్థానానికి, అర్కీ, జుబ్బల్-కోట్‌ఖాయీ, ఫతేపూర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆర్కీ, ఫతేపూర్ స్థానాలను నిలుపుకోవడమే కాక, తక్కిన రెండు స్థానాలనూ కూడా కాంగ్రెసు గెలుచుకుంది. మొత్తం మీద కాంగ్రెసుకు 49% ఓట్లు వస్తే బిజెపికి 28% వచ్చాయి.
మండి లోకసభ నియోజకవర్గం బిజెపికి కంచుకోట. రెండేళ్ల క్రితమే 4 లక్షల మెజారిటీతో బిజెపి అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ కాంగ్రెసు అభ్యర్థి ఆశ్రయ్ శర్మపై గెలిచాడు. పైగా అది ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సొంత జిల్లాలో వుంది. అక్కడ కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ నిలబడి, బిజెపి అభ్యర్థి బ్రిగేడియర్ కుశాల్ ఠాకూర్‌పై 8766 ఓట్ల తేడాతో గెలిచింది.
కోట్‌ఖాయీ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి తన ఐటీ సెల్ కన్వీనర్ చేతన్ బ్రాగ్‌తాకు టిక్కెట్టు యివ్వకపోవడంతో అతను రెబెల్‌గా నిలబడి, 42% ఓట్లు తెచ్చుకుని, కాంగ్రెసు అభ్యర్థి రోహిత్ ఠాకూర్ చేతిలో 6293 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. బిజెపి అభ్యర్థికి 3 వేల ఓట్లతో మూడో స్థానం దక్కింది. ఫతేపూర్‌లో కాంగ్రెసు అభ్యర్థి భవానీ సింగ్ బిజెపికి చెందిన బలదేవ్ ఠాకూర్‌ను 5634 తేడాతో ఓడించాడు. అర్కీలో కాంగ్రెసుకి చెందిన సంజయ్ అవస్థీ, బిజెపి అభ్యర్థి రతన్ పాల్‌పై 3277 తేడాతో గెలిచాడు.
హిమాచల్‌లో యీ ఘోరపరాజయానికి కారణాలేమిటి అని చర్చ జరుగుతోంది. ఆర్థిక పరిస్థితి క్షీణించడం, ద్రవ్యోల్బణం, ముఖ్యంగా పెట్రోలు, డీజిలు, గ్యాసు సిలండరు, వంట నూనె ధరలు భగ్గుమనడం, కరోనాకు ముందూ తర్వాత పోయిన ఉపాధి అవకాశాలు తిరిగి రాకపోవడం కారణమని అనేస్తున్నారు. బిజెపి అధిష్టానం కూడా యీ దిశగా ఆలోచిస్తోందని అనుకోవడానికి కారణం, అర్జంటుగా పెట్రోలు, డీజిలు ధరలు పిసరంత తగ్గించడం, వంట నూనెను మార్కెట్లో లభ్యం చేయడం! కానీ ఈ రేట్లు యిలా వుండగానే ఈశాన్య భారతంలో బిజెపి ఎలా గెలిచింది? ఉత్తరాదిన, దక్షిణాదిన కూడా కొన్ని స్థానాలు గెలిచింది కదా! అందువలన ధరవరలు ఒకటే కాకుండా స్థానికంగా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని అనవలసి వస్తుంది.
స్థానికి నాయకుల కలహాలు తీవ్రస్థాయిలో వున్నాయట. టిక్కెట్ల పంపిణీ లోపభూయిష్టంగా వుందిట. కోట్‌ఖాయీలో మాజీమంత్రి, సిటింగ్ ఎమ్మెల్యేగా వుంటూ కోవిడ్‌తో మరణించిన నరీందర్ బ్రాగ్‌తా కుమారుడు చేతన్‌కు టిక్కెట్టివ్వకుండా నీలం సరాయిక్‌కు యిచ్చారు. ఫతేపూర్‌లో గతంలో గెలిచిన కృపాల్ పర్మార్‌కు కాకుండా బలదేవ్‌కు యిచ్చారు. అర్కీలో రెండు సార్లు గెలిచిన గోవింద శర్మకు కాకుండా రతన్ పాల్‌కు యిచ్చారు. ఇది పార్టీ కార్యకర్తలకు రుచించక పోవడంతో వాళ్లు మనసు పెట్టి పనిచేయలేదు.
బిజెపి అధ్యక్షుడు నడ్డాకు తెలియకుండా టిక్కెట్ల పంపిణీ జరిగిందని అనలేం. పైగా హిమాచల్ చిన్న రాష్ట్రం. అన్నీ స్వయంగా చూసుకోవచ్చు. నడ్డా అంచనాలు తప్పాయని అనుకోవాలంతే! అతనూ అనురాగ్ ఠాకూరూ తిరిగి తీవ్రప్రచారం చేసినా పరాజయం తప్పలేదు. కాంగ్రెసు కూడా అర్కీలో వీరభద్ర సింగ్ అనుయాయి, ప్రజాదరణ కలిగిన రాజేందర్ కుమార్‌కు టిక్కెట్టివ్వకపోతే అతను రెబెల్‌గా నిలబడ్డాడు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా వుండడంతో కాంగ్రెసు అధికారిక అభ్యర్థి గెలిచేశాడు.
ఈ ఓటమి ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ పదవికి ఎసరు తెచ్చేట్లుంది. నిజానికి 2017లో బిజెపి అధికారంలోకి వచ్చినపుడు అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించలేదు. ప్రేమ్ కుమార్ ధూమల్‌ను ముఖ్యమంత్రి చేద్దామనుకుంది. కానీ ఆయన ఓడిపోవడంతో విధి లేక జైరామ్‌ను చేయవలసి వచ్చింది. దరిమిలా 2019 మేలో ధూమల్ కొడుకు అనురాగ్ ఠాకూర్‌కి కేంద్రంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ దక్కింది. జైరామ్‌కు పరిపాలనపై పట్టు లేదని, అధికారగణం చాలా అలసత్వంతో పని చేస్తోందని, మంత్రుల పనీతీరు బాగుండకపోవడమే కాక, అవినీతికి కూడా పాల్పడుతున్నారని చాలా ఫిర్యాదులున్నాయి. సెప్టెంబరులో బిజెపి అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చినపుడు జైరామ్‌కు వేటు పడుతుందని అనుకున్నారు. ఎందుకో గానీ అధిష్టానం వారు కొనసాగించారు.
కానీ ప్రత్యామ్నాయంగా అనురాగ్‌ను దువ్వడం మొదలుపెట్టారు. అతన్ని కాబినెట్ హోదాకు ప్రమోట్ చేశారు. అతను జన ఆశీర్వాద్ యాత్ర అంటూ ర్యాలీలు చేస్తే ప్రజాదరణ బాగుందని మురిశారు. వచ్చే ఏడాది ఎన్నికల వేళ అతన్నే ముఖ్యమంత్రిగా చూపించవచ్చని అనుకుంటూండగా యీ ఫలితాలు వచ్చి అనురాగ్ కూడా ఏమీ సాధించలేడని నిరూపించాయి. నెగ్గిన వాటిలో రెండు కాంగ్రెసుకు బలమైన స్థానాలనీ, ఆర్నెల్ల క్రితమే మరణించిన వీరభద్ర సింగ్‌పై సానుభూతి రాష్ట్రమంతా ప్రభావితం చేసిందని జైరామ్, అనురాగ్ చెప్పుకున్నా అమిత్ షా వినకపోవచ్చు.
రాజకీయంగా లాభించకపోతే ప్రధాని సొంత రాష్ట్రం (తనది కూడా)లో కూడా ముఖ్యమంత్రిని మార్చివేయగల ధీశాలి అతను. జైరామ్‌కు ప్రత్యామ్నాయం ఎవరు అనేది ఆలోచిస్తూండవచ్చు. వారు దొరకగానే స్వస్తి చెప్పవచ్చు. లేకపోతే చేతులారా కాంగ్రెసుకు నీరు పోసి ప్రాణం నిలబెట్టినట్లవుతుంది. (ఫోటో – నడ్డా, అనురాగ్, జైరామ్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)