వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తప్పారు. అది సొంత పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ విషయంలోనే. సహజంగా జగన్ మాట ఇస్తే తన తండ్రి వైఎస్సార్ మాదిరిగా నిలబెట్టుకుంటారనే పేరుంది. అందుకే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఖాయమని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రెండుమూడు సార్లు ఎమ్మెల్సీ పదవుల పంపిణీ జరిగింది. ప్రతిసారి మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఖాయమని మీడియా కోడై కూయడం తప్ప… ఆయనకు పదవీ యోగం లేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ దివంగత వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడనే పేరు.
మర్రి రాజశేఖర్ మామ, దివంగత మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య గుంటూరు జిల్లాలో రాజకీయంగా పేరున్న నాయకుడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సాంబయ్య 1978లో మొదటిసారిగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 1985లో ఎన్టీఆర్ గాలిలో కూడా ఆయన విజయం సాధించి తన పట్టు నిలబెట్టుకున్నారు. 1994లో మరోసారి ఆయన గెలుపొందారు. అనంతరం 1999లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. 2004లో సాంబయ్య అల్లుడు మర్రి రాజశేఖర్ రాజకీయ ప్రవేశం చేశారు.
ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించి అందరి దృష్టి ఆకర్షించారు. వైఎస్సార్ గాలిలో మర్రి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం ఆ కుటుంబానికి చిలకలూరిపేటలో ఉన్న ప్రజాబలాన్ని ప్రతిబింబించింది. అనంతరం ఆయన వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓటమిపాలయ్యారు.
వైఎస్సార్ మరణానంతరం మర్రి రాజశేఖర్ వైసీపీలో చేరి జగన్‌కు అండగా నిలిచారు. 2014లో వైసీపీ తరపున మర్రి రాజశేఖర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రాకపోయినా ఆయన ఆ పార్టీని వీడలేదు. 2019లో టీడీపీ నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజనీకి వైసీపీ టికెట్ దక్కింది.
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం చిలకలూరిపేటకు వచ్చిన వైఎస్ జగన్ …వేలాది మంది సాక్షిగా మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి హామీ ఇచ్చారు. తన మాట మన్నించి రజనీకి మద్దతు ఇచ్చేందుకు సమ్మతించిన మర్రి రాజశేఖర్‌పై జగన్ సానుభూతి చూపడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చిలకలూరిపేటలో నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి, రజనీని గెలిపించుకొస్తే తన హామీని నెరవేరుస్తానని జగన్ నమ్మబలికారు.
చిలకలూరిపేట ఎమ్మెల్యేగా రజనీ గెలుపొందారు. కానీ మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ , మంత్రి పదవి హామీని మాత్రం జగన్ నిలబెట్టుకోలేదనే విమర్శలొస్తున్నాయి. నిజంగా మర్రి రాజశేఖర్‌కు కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే తలంపు వుంటే…. నెరవేర్చడం పెద్ద విషయం కాదని వైసీపీ నేతలే చెబుతున్నారు. మర్రిపై జగన్ మనసులో వ్యతిరేక భావన వుండడం వల్లే విస్మరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన కార్యక్రమాల రూపకర్త తలశిల రఘురాం కంటే మర్రి రాజశేఖర్ అంత తీసిపోయారా? అనే చర్చ జరుగుతోంది.