అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనకు నామినేటెడ్ పదవి వద్దనడంతోనే మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కింది. వైసీపీలోనూ, సమాజంలోనూ విశ్వేశ్వరరెడ్డికి ప్రత్యేక గౌరవం ఉంది. వామపక్ష ఉద్యమాల నుంచి విశ్వేశ్వరరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు.
పీడితులు, కార్మికుల పక్షపాతిగా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లో నిస్వార్థపరుడిగా ప్రత్యర్థులు సైతం గౌరవించే ఏకైక వైసీపీ నాయకుడు విశ్వ అని విశ్లేషకులు చెబుతారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట విశ్వేశ్వరరెడ్డి నడిచారు. 2014లో వైసీపీ తరపున అనంతపురం జిల్లాలో కదిరితో పాటు ఉరవకొండలో మాత్రమే గెలిచారు. వీరిలో విశ్వేశ్వరరెడ్డి ఒకరు. కదిరి నుంచి గెలిచిన మైనార్టీ నేత ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. 2019లో ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు. విశ్వేశ్వరరెడ్డి ఓటమికి టీడీపీ కంటే సొంత పార్టీకి చెందిన నేతలే కారణమని ఆ జిల్లా వాసుల అభిప్రాయం.
విశ్వేశ్వరరెడ్డికి ఉన్న మంచిపేరు దృష్ట్యా ఆయనకు కీలక పదవి ఇవ్వాలని సొంత పార్టీలో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 14 ఎమ్మెల్సీ పదవులు రావడంతో మరోసారి విశ్వేశ్వరరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ లేదా ఉరవకొండ నియోజక వర్గ ఇన్చార్జ్ పదవుల్లో ఏదో ఒకటి కోరుకోవాలని వైసీపీ అధిష్టానం ఆయన ముందు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఎమ్మెల్సీ పదవి వద్దని, ఉరవకొండ ఇన్చార్జ్ బాధ్యతలే నిర్వర్తిస్తానని విశ్వేశ్వరరెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం.
దీంతో వై.శివరామిరెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా ఉరవకొండ వైసీపీలో ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అని కొందరు నేతలు ఓవరాక్షన్ చేయడంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు ప్రణయ్ రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతీసే కుట్రలకు ఇప్పటికైనా చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.