కమ్మ సామాజిక వర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్ష కట్టారని ఎల్లో మీడియా, టీడీపీ ఓ పథకం ప్రకారం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ పదవుల్లో కమ్మ సామాజిక వర్గానికి తన సామాజిక వర్గంతో పాటు సమానంగా జగన్ పెద్ద పీట వేయడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు రెడ్లు, మరో రెండు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించడం గమనార్హం.
రెడ్ల విషయానికి వస్తే కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందురెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేశారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన వై.శివరామిరెడ్డికి కూడా మరోసారి పదవి కట్టబెట్టారు.
ఇక కమ్మ సామాజిక వర్గం విషయానికి వస్తే… తన కార్యక్రమాల రూపకర్త తలశిల రఘురామ్, ప్రకాశం జిల్లా మాధవరావుకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ప్రధానంగా కమ్మ సామాజికవర్గంపై అక్కసుతోనే అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చారని ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి రెండు ఎమ్మెల్సీ పదవులను కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడంపై …పచ్చ గ్యాంగ్ ఏమంటుందని వైసీపీ ప్రశ్నిస్తోంది.
రాజకీయంగా తన వెన్నంటి నమ్మకంగా నడిచే వాళ్ల గుణమే తప్ప కులం జగన్ చూడరనేందుకు ఇదే నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతున్నారు.