cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: రాజా విక్రమార్క

మూవీ రివ్యూ: రాజా విక్రమార్క

టైటిల్: రాజా విక్రమార్క
రేటింగ్: 2/5 
తారాగణం: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, హర్ష వర్ధన్, సుధాకర్ కోమాకుల, పశుపతి రామస్వామి
కెమెరా: పి.సి. మౌళి
ఎడిటింగ్: జస్విన్ ప్రభు 
సంగీతం: ప్రశాంత్ విహారి
నిర్మాతలు: రామా రెడ్డి, ఆదిరెడ్డి
దర్శకత్వం: శ్రీ సారిపల్లి 
విడుదల తేదీ: 12 నవంబర్ 2021

నాయక్, అల్లుడు శీను లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన శ్రీసారిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేసాడు. 2019 లోనే శ్రీకారం చుట్టుకున్న ఈ సినిమా అనేక కోవిడ్ కష్టాలను దాటి నేడు విడుదలయ్యింది. 

పాటలు జనబాహుళ్యంలోకి పెద్దగా వెళ్లకపోయినా, కేవలం కార్తికేయ మీదున్న ఆసక్తి వల్ల దీనిపై ఒక వర్గం ప్రేక్షకుల దృష్టి పడింది. కార్తికేయ కూడా తాను ఇంతవరకూ చేసిన చిత్రాల్లో ఇది భిన్నమయినదని, తొలిసారి పూర్తి స్థాయి లవర్ పాత్ర చేస్తున్నానని చెప్పుకున్నాడు. 

ఒక ఎన్.ఐ.ఏ ఏజెంటు, లోకల్ పోలీసులు, నక్సలైట్లు, హోం మినిస్టరు, అతని కూతురు..అదీ స్టొరీ అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే కథేంటని అడిగితే ఆసక్తిగా చెప్పడానికి ఏమీ లేదు. 

ఇటుకలను పేరిస్తే గోడ అయిపోదు. సిమెంటేసి ప్లాస్టరింగ్ చెయ్యాలి. అలాగే సీన్లు పేర్చుకుంటూ వెళ్లిపోతే సినిమా అయిపోదు. ఎమోషన్ తో ప్లాస్టరింగ్ చెయ్యాలి. ఇక్కడలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదు. తెర మీద త్వర త్వరగా సీన్లు కదులుతుంటాయి. ఎమోషనల్ గా కట్టిపారేసే సందర్భాలు కానీ, కథలోకి మనసుని లాక్కెళ్లిపోయే విధానం కానీ కనపడదు. 

హోం మినిస్టర్ కూతురు ఒంటరిగా ఒక సామాన్యుడి బైక్ మీద ఊరి పొలిమెర్లకి వెళ్లిపోతుంది. పోనీ అప్పటికి అతనితో పీకల్లోతు ప్రేమలో ఏమైనా పడిపోయిందా అంటే అదీ కాదు. అలా ఎలా వెళ్తుంది? ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల తలల్లో మొలిచాయంటే అది చాలా బ్యాడ్ రైటింగ్ అని అర్థం. ఆడియన్స్ ని తక్కువ అంచనా వేస్తేనో, లేక తమని తాము ఎక్కువ అంచనా వేసుకుంటేనో తప్ప ఇలాంటి సినిమాలు రావు. 

హీరోయిన్ కిడ్నాప్ సీన్ అయితే అలానాటి విఠలాచార్యకి, ఈ నాటి రాజమౌళికి కూడా అందనంత హైలైట్. హోం మినిస్టర్ కూతురు టాప్ లెవెల్ సెక్యూరిటీ మధ్య డ్యాన్స్ చేస్తుంటే ఉన్నట్టుండి స్టేజ్ ఆమెను లోపలకి లాగేసుకుంటుంది. అదేంటో గానీ పాతాళంలోకి వెళ్లిపోయినట్టుగా మాయమైపోతుంది. అక్కడి నుంచి పోలీసుల గాలింపు చర్యలు వగైరా. 

"ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్" లోని ఒక సీన్ ని గుర్తు తెచ్చేలాగ క్లైమాక్సులో ఒక పాత్ర హీరోయిన్ కి గంతలు కట్టి వికెట్టుతోటి బలంగా కొడతాడు. ఆ దెబ్బకి ఆమె చచ్చిపోవాలి అసలైతే. కానీ ఏదో చిన్న గాయంతో నార్మల్ గా లేచి కూర్చుంటుంది. ఇలా ఏ సీన్ ని ఏ మోతాదులో తియ్యాలో కనీస అవగాహన లేకుండా తీసేసారు. 

ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ ఎడిటింగ్. ఒక సీన్ ని సగం చూపించి.. మిగిలిన సగాన్ని కాస్త గ్యాప్ తీసుకుని చూపించడం, కంటిన్యుటీ లేకుండా జంప్ కట్ చేయడం వంటివి ఇందులో కనిపిస్తాయి. ఇవన్నీ టెక్నికల్ గా పక్కన పెట్టేసేవి కాదు. ఎందుకంటే చూస్తున్నప్పుడు ఇవి పంటి కింద రాళ్లల్లాగానో, లేక కథలో లీనమవడానికి అవరోధాల్లాగానో ఉంటాయి. 

పాటలు ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కథనాన్ని మోసింది. 

కార్తికేయ తనకంటూ ఒక ముద్రని తెచ్చుకోలేకపోతున్నాడు. ఒక సీన్లో మహేష్ బాబుని అనుకరించినట్టూ, మరొక సీన్లో ప్రభాస్ ని అనుసరించినట్టూ అనిపిస్తోంది తప్ప తన సొంత మార్క్ చూపించట్లేదు. 

హీరోయిన్ తాన్య రవిచంద్రన్ మాత్రం కంటికింపుగా ఉంది. నటన కూడా ఓకే. ఎక్కడా గ్లామర్ ఒలకపోతకి వెళ్లకుండా డీసెంటుగా చేసింది. 

తనికెళ్ళ భరణి చెప్పిన ఒకటి రెండు డయలాగ్స్ బాగున్నాయి- "తెర మీద హీరోని చూసి చొక్కా చింపుకుంటే పిచ్చితనం, అదే తెరనే చింపేస్తే పైత్యం" లాంటివి బాగా పేలాయి. 

సాయికుమార్, సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్ మొదలైన వాళ్లంతా ఓకే. పశుపతి పాత్ర తేలిపోయింది. బిల్డప్పెక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుంది. 

సరైన హోం వర్క్ చేయకుండా, ప్రీ ప్రొడక్షన్ లోనే అనేకమైన తప్పులు చేసి తెరకెక్కించిన చిత్రం ఇది. లాజిక్ కానీ, మ్యాజిక్ కానీ, మ్యూజిక్ కానీ అస్సలు లేని సినిమా ఇది. 

బాటం లైన్: రాజా విక్రమూర్ఖ

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!