డేంజర్ సెంటిమెంట్.. హరీష్ రావుకు చుట్టుకుంది

అదేంటి.. హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైనా.. స్టార్ క్యాంపెయినర్ హరీష్ రావుకి కేసీఆర్ అదనంగా మంత్రి పదవి ఇచ్చారు కదా..? ఇది సంతోషించాల్సిన విషయం కానీ, బాధపడే విషయం కాదు కదా..? అనుకుంటున్నారా..? అక్కడే…

అదేంటి.. హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైనా.. స్టార్ క్యాంపెయినర్ హరీష్ రావుకి కేసీఆర్ అదనంగా మంత్రి పదవి ఇచ్చారు కదా..? ఇది సంతోషించాల్సిన విషయం కానీ, బాధపడే విషయం కాదు కదా..? అనుకుంటున్నారా..? అక్కడే ఉంది చిన్న మతలబు. 

ఆ శాఖ సారథ్యం అప్పగించారంటే.. సీటు కిందకు నీళ్లొచ్చిన్నట్టే.. మంత్రి పదవికే కాదు ఏకంగా రాజకీయ భవిష్యత్తు కూడా మసకబారినట్టే. అలా ఉంది మరి ఆ సెంటిమెంట్. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన వారంతా ఇప్పుడు కష్టాల బాటలోనే ఉన్నారు.

రాజయ్యతో మొదలు..

టి.రాజయ్య. తెలంగాణ తొలి దళిత ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా. అయితే పట్టుమని 8 నెలలు కూడా గడవకముందే ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. అదే ఊపులో ఆయన పార్టీ నుంచి కూడా బయటికెళ్లిపోతారనుకున్నా.. ఆ సాహసం చేయలేదు. 

పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత పొలిటికల్ కెరీర్ అస్తవ్యస్తమైంది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా చివరి నిమిషం వరకూ ఆయన టెన్షన్ పడేవారు.

రాజయ్యను బర్తరఫ్ చేసిన తర్వాత ఆ పదవిని అప్పటి విద్యుత్ శాఖ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అప్పగించారు. మెరుపులు లేవు, మరకలు లేవు. 2018 వరకు ఆ పదవిలో ఆయన కొనసాగారు. విచిత్రం ఏంటంటే.. రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మంత్రి పదవి దక్కలేదు. 

ఫస్ట్ టర్మ్ మంత్రిగా ఉండి, రెండోసారి పదవి కోల్పోయిన అతి తక్కువమందిలో ఆయన కూడా ఒకరు. దీనికి కూడా వైద్య, ఆరోగ్య శాఖ నెగెటివ్ సెంటిమెంటే కారణం అనే టాక్ మొదలైంది.

మూడో బలి ఈటల..

2018 ఎన్నికల తర్వాత తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలు చేపట్టారు. ఈటల, కేసీఆర్ మధ్య ఇగోలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. కానీ ఇలా కేసులు బనాయించి, అవమానించి పార్టీ నుంచి బయటకు పంపేస్తారనేది ఎవరూ కలలో కూడా ఊహించని విషయం. కానీ అదే జరిగింది.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలను బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి అష్టకష్టాలు పడి చివరకు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈటల ఎపిసోడ్ ఇన్ని మలుపులు తిరగడానికి, ఆయన రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ నుంచి బీజేపీకి మారడానికి వైద్యారోగ్య శాఖే కారణం అంటారు కొందరు.

ఈటల నుంచి పదవిని లాగేసుకున్న తర్వాత కొన్ని నెలలపాటు కేసీఆర్ అదనపు బాధ్యతలు చేపట్టారు. విచిత్రం ఏంటంటే కేసీఆర్ కి కూడా ఆ శాఖ కలసి రాలేదు. హుజురూబాద్ లో పార్టీ ఓటమితో కేసీఆర్ పరువు మంటగలిసింది. దీంతో అసలీ శాఖతో తలనొప్పులు ఎందుకని దాన్ని తీసుకెళ్లి హరీష్ రావు చేతిలో పెట్టారు. 

అదనపు బాధ్యతలు అంటే సంతోషించే విషయమే అయినా.. ఐరన్ లెగ్ లాంటి శాఖను తీసుకొచ్చి చేతిలో పెట్టారు కాబట్టి హరీష్ కాస్త ఆలోచించాల్సిందే. మరి ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ ఈ శాఖలో రాణిస్తారా లేక నెగెటివ్ సెంటిమెంట్ కు గురవుతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.