Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: పుష్పక విమానం

మూవీ రివ్యూ: పుష్పక విమానం

టైటిల్: పుష్పకవిమానం
రేటింగ్: 2.5/5
తారాగణం: ఆనంద్ దేవరకొండ, గీత్ శైని, శాన్వీ మేఘన, నరేష్, సునీల్, హర్షవర్ధన్ తదితరులు 
కెమెరా: హెస్టిన్ జోస్ జోసెఫ్ 
ఎడిటింగ్: రవితేజ గిరిజాల 
సంగీతం: మార్క్ జె రాబిన్, రాం మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దసాని
నిర్మాతలు: గోవర్ధన రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబల్లి 
దర్శకత్వం: దామోదర 
విడుదల తేదీ: అక్టోబర్ 29, 2021

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ "మిడిల్ క్లాస్ మెలొడీస్" తర్వాత చేసిన సినిమా ఇది. టైటిల్ చాలా క్యాచీగా ఉండి, ట్రైలర్ ఫన్నీగా ఉండి చూడాలనిపించేలా చేసాయి. దానికి తోడు సెలెబ్రిటీల ప్రచారపర్వం కూడా హైప్ కి తోడయ్యింది. 

ఒక ప్రభుత్వ పాఠశాల టీచరు తన అమాయకత్వంతో కొత్త భార్యతో ఎలాంటి కష్టాలు కొనితెచ్చుకున్నాడు? ఆమె ఎవరితోనో లేచిపోతే ఏ పరిస్థితుల్లోకి వెళ్లాడు? చివరికి ఏమయ్యిందనేది ప్లాట్. 

నిజానికి ఈ కథని ఆద్యంతం హాస్యరసభరితంగా తీయొచ్చు లేదా పూర్తి సీరియస్ సినిమాగానూ తెరకెక్కించొచ్చు. కానీ దర్శకుడు మల్టిపుల్ జానర్ ని ఎంచుకున్నాడు. మొదటి సగం సరదాగా, రెండో సగం ఉత్కంఠగా, ప్రీ క్లైమాక్స్ బాధగా, క్లైమాక్స్ సందేశాత్మకంగా ..ఇలా అన్నమాట. 

నిజానికి స్క్రీన్ ప్లే కోసం పడిన కష్టం కనిపిస్తుంది. ఉన్నంతలో ఆడియన్స్ ని హాయిగా ఎలా కూర్చోపెట్టాలా అని చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోబుద్ధేస్తుంది. టెకాఫ్, ప్రయాణం పుష్పకవిమానంలో కూర్చున్నట్టే ఉన్నా, ల్యాండింగ్ మాత్రం రన్ వే మీద కాకుండా పొలాల్లో అయినట్టనిపించింది. 

ఆనంద్ దేవరకొండ పాత్రకు లోబడి చాలా చక్కగా చేసాడు. వాచకం అచ్చుగుద్దినట్టు తన అన్నని పోలి ఉన్నా తనదైన శైలిలో నటించాడు. సినిమా మొదట్లోనే హీరోగారి భార్య లేచిపోవడమనే పాయింట్ మునుపెన్నడూ చూడనిది. అదొక్కటీ వెరైటీ ఇందులో. 

గీత్ శైని చూడ్డానికి బాగుంది. నటనకూడా అవకాశమున్నంతవరకు బాగానే చేసింది. కానీ ఆమె పాత్ర చిన్నగా ఉండడం వల్ల గుర్తుండేలా లేదు. శాన్వి మేఘన మాత్రం నటనాప్రతిభ, నాట్య కళ బాగా ప్రదర్శించింది. రెండు మూడు సీన్స్ లో ఆమె వైవిధ్యభరితమైన నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కాకపోయినా ఆ స్థానంలో గుర్తుంచుకునే విధంగా ఉంది. 

సునీల్ కి పోలీసు పాత్ర పెద్దగా నప్పలేదు. అసలిది సునీల్ కోసం రాసినట్టు లేదు. ఎవరు చేసినా ఓకే అన్నట్టుగా ఉంది. మిగిలిన నటీనటులంతా పర్వాలేదు. కెమెరా పనితనం వంకపెట్టేలా లేదు. ఎడిటింగ్ ని కూడా ఏమీ అనలేం. అన్ని ట్విస్ట్లతో పొడవాటి కథ చెప్పి క్రిస్ప్ గా ఎడిటింగ్ చెయ్యమంటే ఎవరికైనా కష్టమే. 

ఈ సినిమాకి ఏకంగా నలుగురు సంగీత దర్శకులు పని చేసారు. కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్న రాం మిరియాల పాడిన "సిలకా" అనే పాట ఆకట్టుకుంటుంది. "ఓ తారకా!" అనే పాట కూడా రెట్రో ఫీల్ తో బాగుంది. 

దర్శకుడు అంతా బాగానే రాసుకుని సెకండాఫ్ చివర్లో తప్పటడుగులు వేసాడు. కథ ఏదైనా సరే ట్రీట్మెంటుని బట్టి ఫ్లావర్ మారుతుంది. నిజానికిది సీరియస్ కథ. కానీ ఫస్టాఫ్ అంతా సరదాగా నవ్వుకునేలా లైటర్ వీన్ లో నడిచింది. దానివల్ల ప్రేక్షకులకి బరువుగా అనిపించదు. ఇలా ఎంచుకున్న విధానం బాగుంది. ఏ టర్బులెన్సు లేకుండా విమానంలో వెళ్తున్నట్టు ఉంటుంది. 

కానీ ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో ముగింపు అంతకంటే ముఖ్యం. కథని ఎన్ని మలుపులు తిప్పి ఏం చేసినా క్లైమాక్స్ సుఖాంతంగా ఉంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యుండేది. ఇప్పటికైతే ఇది ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే నచ్చేలాగా, ఓటీటీల్లో మాత్రం ఓకే అనేలాగా ఉంది. 

అసలీ కథకి "పుష్పకవిమానం" కి లింకు లేదు. కథలో పుష్పక్ ట్రావెల్స్ అనే కంపెనీ నుంచి ఒకతను ఫోన్ చేస్తుంటాడు. హీరోకి విమానంలో భార్యపక్కన కూర్చుని హనీ మూన్ కి వెళ్లాలనే కోరికున్నట్టు చెబుతాడు. అందుకే ఈ టైటిల్ పెట్టారనుకోవాలి. అది తప్ప మరో క్లూ కనపడదు. 

అయితే పుష్పకవిమానం గురించి పురాణాల్లో ఒకటి చెప్తారు. అందులో కూర్చోవడానికి ఎంతమందికైనా చోటుంటుందని. ఆ లెక్కన ఈ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్స్ లోనూ బోలెడంత చోటుంది. చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలా టైటిల్ జస్టిఫికేషన్ జరిగిందనుకోవాలి.  

బాటం లైన్: అమాయకుడి వివాహబాధ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?