ఇటీవల వరుస వివాదాస్పద ట్వీట్లతో జనసేనాని పవన్‌కల్యాణ్ సోదరుడు, నటుడైన నాగబాబు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అందులోనూ జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన గాడ్సేను దేశ భక్తుడంటూ నాగబాబు చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత ఇండియన్ కరెన్సీపై గాంధీతో పాటు ఇతర మహనీయుల బొమ్మలు కూడా ముద్రించాలని ఆయన ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
మహాత్ముని కించపరిచేలా నాగబాబు ట్వీట్లు ఉన్నాయని ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో నాగబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేనకు చెడ్డ పేరు వస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ భయపడ్డారు. వెంటనే ఆయన ట్విటర్ ద్వారా రంగంలోకి దిగారు. నాగబాబు ట్వీట్లతో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ ట్వీట్లు పూర్తిగా నాగబాబు వ్యక్తిగత మని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో నాగబాబు ట్విటర్‌లో అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన తిరుమల వెంకన్నపై స్పందించారు. టీటీడీకి సంబంధించి తమిళనాడులోని 23 చోట్ల నిరర్థక ఆస్తుల విక్రయ నిర్ణయంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఏడు కొండల వాడా వెంకట రమణా.. గోవిందా గోవిందా. ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి' అని ఆయన ట్వీట్ చేశారు. కనీసం ఈ ట్వీట్ అయినా పార్టీకి సంబంధం ఉందా? లేదా ? అనే విషయం తేలాల్సి ఉంది. మంచైతే మనోడు, కాకుంటే తమకేం సంబంధం లేదనే రీతిలో పవన్ వ్యవహరించిన నేపథ్యంలో….నాగబాబు తాజా ట్వీట్‌ను జనసేన పార్టీ ఏ విధంగా స్వీకరిస్తుందోననే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.