వైవి సుబ్బారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్. ఆయన పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక మార్పులు చేస్తూ, ఓ సానుకూల పరిస్థితిలో పయనిస్తున్నారు. దర్శనాల్లో మార్పులు, నిధులను సరైన బ్యాంకుల్లో వుంచడం, కళ్యాణం లడ్డూలు అందరికీ అందించడం, ఇలా అనేక చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్లుండి రెండు వివాదాలు. ఒకటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, పొరుగున వున్న కర్ణాటక, తమిళనాడుల్లో వేంకటేశ్వరుడి ప్రసాదం అయిన లడ్డూ విక్రయం అలాగే వివిధ ప్రాంతాల్లో భక్తుల ఇచ్చిన కొన్ని స్థలాల విక్రయం. దీంతో మహాపరాథం జరిగిపోయిందన్న గగ్గోలును తెలుగుదేశం అనుకూల మీడియా ప్రారంభించేసింది.
అసలు ఏమిటిదంతా? ఆయననే అడిగితే తెలుసుకుంటే…ఈ ప్రయత్నంలో భాగంగా 'గ్రేట్ ఆంధ్ర' నేరుగా వైవి సుబ్బారెడ్డి ని ఇంటర్వూ చేసింది.
దాదాపు పది నెలల కాలంగా వీలయినంత వివాద రహితంగా వున్న మీ నిర్ణయాలు ఇప్పుడు ఎందుకు వివాదాస్పదమవుతున్నాయి?
ఇందులో పెద్ద రహస్యమేముంది? అన్ని విధాలా జనరంజకంగా సాగుతున్న జగన్ పాలన మీద బురద వేయడానికి తప్ప. జగన్ వేరే మతస్థులు అని చెప్పి, మరో మతం వారిని రెచ్చగొట్టడం.
-ఇందులో వైకాపాకు భాజపాను దూరం చేసే కోణం కూడా వుందంటారా?
ఎందుకు లేదు. ఈ విధమైన కుట్రలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ అలవాటేగా?
-సరే, ఆ సంగతి అలా వుంచి అసలు ఈ భూముల అమ్మకం వైనం ఏమిటి?
అమ్మకం సంగతి తరువాత చెబుతాను. ముందు దీని నేపథ్యం వినండి. గతంలో భాజాపా ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రిగా వుండగా, భాజపా సభ్యులు టీటీడీ పాలకమండలి లో వుండగా చేసిన తీర్మానం ఇది. ఇవ్వాళ మేమేదో కొత్తగా చేసిన తీర్మానం కాదు.
కొన్ని గైడ్ లైన్స్ తో కొన్ని భూములు ఐడెంటిఫై చేసి, విక్రయించి, ఆ సొమ్ము దేవుడి ఖజానాకు జమచేయాలనే తీర్మానాన్ని వారు చేసారు. ఇప్పుడు అమలు చేసే పని మేము చేపట్టాం అంతే. పైగా కొత్త విషయం కాదు. గతంలో అనేక సార్లు చేసినదే. ఇప్పుడు ఆ జాబితా అంతా తయారుచేసి, అందించే పనిలో వున్నాం.
దేవుడికి భక్తుల ఇచ్చిన భూములు అమ్మాల్సిన అవసరం ఏమిటి? పెద్దగా వచ్చే పెద్ద మొత్తం కూడా కాదు.
ఇక్కడ డబ్బు అన్నది కాదు. భక్తులు స్వామి వారి మీద భక్తితో ఎక్కడెక్కడో చిన్న చిన్న ఇళ్ల స్థలాలులేదా వేరే జాగాలు అనేకం వున్నాయి. ఉదాహరణకు తమిళనాడులో ఏధో మారుమూల పల్లెలో రెండు సెంట్లొ లేదా పది సెంట్లో స్థలం వుంటుంది. దాన్ని నిర్వహించలేము.
దాని మీద వచ్చే ఆదాయం కన్నా, దాని బాగోగులు, లెక్కలు చూడాలంటే జరిగే తతంగం ఎక్కువ. వదిలేస్తే లోకల్ గా అన్యాక్రాంతం అయిపోతుంది? ఏం చేయమంటారు? అలా వదిలేయమంటారా? విక్రయించి, దేవుడి సొమ్ము కాపాడమంటారా? పోనీ ఈ నిర్ణయం వెనక్కు తీసుకుంటాం. ఏం చేయాలో మీరు చెప్పండి. మీరు అంటే ఈ విమర్శించే వాళ్లను అడుగుతున్నా. ఏం చేయాలో చెప్పండి.
భక్తుల మనోభావాలను దెబ్బతీసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నపుడు క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద వుంది కదా?
కావాలని తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు ఏం చెబుతాం? చెప్పినా వాళ్లకు కావాల్సింది ప్రముఖంగా, మన వివరణ ఎక్కడో చిన్నగా వేస్తారు. అయినా ఈ విషయం మీద సమగ్ర వివరాలతో వివరణ తయారుచేయిస్తున్నాం.
స్థలాల సంగతి సరే, ఈ లడ్డూల విక్రయం ఏమిటి?
అది కూడా తప్పుడు ప్రచారమే. కరోనా నేపథ్యంలో నిత్యం తయారుచేసే లక్షలాది లడ్డూల కోసం సేకరించి వుంచిన సరుకులు వున్నాయి. అవి పాడయిపోతాయి. ఏం చేద్దాం అని అధికారులు నన్ను అడిగారు. అదే సమయంలో అనేక మంది భక్తులు లేఖల ద్వారా మెయిల్స్ ద్వారా దేవుడిని దర్శించుకోలేకపోతున్నాం. ఆన్ లైన్ లో పూజలన్నా చేసి, ప్రసాదం పంపండి అని అడగడం ఎక్కువయింది.
అయితే ఆగమశాస్త్ర ప్రకారం తిరుపతిలో ఆన్ లైన్ పూజలు, చిత్రీకరణలు కుదరదు. అందుకే ఈ సరుకుల వినియోగం జరిగిపోతుంది. జనాలకు లడ్డూలు అందుతాయి అని ఆలోచించి తయారుచేసి, ఫ్రీగా పంచేయండి అని చెప్పా. అయితే అన్నీ తిరుపతిలోనే పంచలేం. అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీడీ సమాచార కేంద్రాలు వున్నాయి. అక్కడ కూడా పంచుదాం అన్నారు. కానీ రవాణా ఖర్చులు అవుతాయి. అయితే రవాణా ఖర్చులు మాత్రం తీసుకుని, లడ్డూను ఫ్రీగా ఇవ్వండి అని చెప్పాను.
ఆ విధంగా కేవలం సరుకుల ఖర్చు కాకుండా, ఇతరత్రా ఖర్చు కింద పాతిక రూపాయలు తీసుకుని భక్తులందరికీ ఈ కరోనా టైమ్ లో కూడా దేవుడి ప్రసాదం అందేలా చేయాలని నిర్ణయించాం.
టీటీడీ స్వీట్ స్టాల్ అనే విమర్శ సంగతేమిటి?
దేవుడి ప్రసాదాన్ని భగవత్ స్వరూపంగా మనం భావిస్తాం. అలాంటి దాన్ని స్వీటు అని ఎవ్వరూ అనరు. అలాంటిది ఈ విమర్శలు చేసే వాళ్లు పవిత్రమైన ప్రసాదాన్ని స్వీటుతో పోలుస్తారా? భక్తుల మనోభావాల్ని ఎవరు దెబ్బతీస్తున్నట్లు?
సరే, బాగానే వుంది.. మరి బల్క్ సరఫరా ఎందుకు?
కోవిడ్ టైమ్ లో స్వచ్ఛంధ సంస్థలు అనేకం, జనాలకు వివిధరకాలుగా సరుకులు అందిస్తున్నాయి. వాళ్ల నుంచి మాకు వచ్చిన వినతి ఏమిటంటే, మాకు బల్క్ గా అందిస్తే, మేము జనాలకు అందిస్తాము అన్నది.
కానీ మిస్ యూజ్ కావడానికి అవకాశం వుంటుంది కదా?
వుండొచ్చు. అందుకే ఈ బల్క్ సరఫరా ఇంకా ప్రారంభించలేదు. విధి విధానాలు రూపొందించమన్నా. ఎవరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు.. అన్నది పక్కాగా స్క్రూట్నీ చేయాల్సి వుంటుంది. ఆ తరువాత ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది వుంటుంది.
ఇలా ఎన్నాళ్లు…కరోనా తరువాత కూడా కొనసాగిస్తారా?
అలా ఎందుకుచేస్తాం? తిరుమలలో తయారయ్యే లడ్డూలు ఇక్కడ వినియోగానికే చాలవు. కేవలం కరోనా టైమ్ లో భక్తుల సెంటిమెంట్, సరుకుల వినియోగం ఇలాంటివి అన్నీ దృష్టిలో వుంచుకుని తీసుకున్న నిర్ణయం ఇది.
ఇప్పుడు మళ్లీ మొదటికి వద్దాం. ఈ విషయాల్లో రాజకీయ కోణం ఏమిటి?
అందరికీ తెలిసిందే. హిందూత్వను రెచ్చగొట్టడం, ఎలాగైనా వైకాపాకు భాజపాకు మధ్య చిచ్చు పెట్టడం, సాఫీగా సాగుతున్న జగన్ మోహన్ రెడ్డిగారి పాలనను సాగకుండా చేయడం, గతంలో కూడా తిరుపతి విషయంలో చాలా చేయాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడూ అంతే.
రాజా