ఎవరెవరినో ఏపీకి రానీయనంటూ ఏడాది కిందటి వరకూ హల్చల్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏపీలోకి ఎంటర్ కావడానికి ఎవరెవరికో లేఖలు పెట్టుకునే పరిస్థితి వచ్చినట్టుగా ఉంది! తను సీఎంగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు అనేక మందికి బహిరంగ హెచ్చరికలు జారీ చేసే వారు. మోడీని ఏపీలో అడుగుపెట్టనిచ్చేది లేదని, అలాగే సీబీఐకి ఏపీలో ఎంట్రీ లేదని అప్పట్లో చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారు. ఇక చంద్రబాబు భక్తగణం అయితే మరింత ఓవర్ చేసింది. అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్లు వేసిన దాఖలాలున్నాయి. అలా ఏపీలోకి ఎవరు రావాలన్నా, పోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అనేంత స్థాయిలో వారు రచ్చ చేశారు.
కట్ చేస్తే.. ఈ మధ్యనే తను ఏపీకి వెళ్లడానికి అనుమతిని ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ అనుమతి లేఖను పెట్టుకున్నారు. అయితే కేంద్రం ఆ విషయంలో స్పందించినట్టే లేదు. చంద్రబాబు నాయుడి లేఖను బుట్టదాఖలు చేసినట్టుగా ఉన్నారు.
అదలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి తన అనుమతి లేఖను పెట్టుకున్నారు చంద్రబాబు. కేంద్రానికి లేఖ రాసి అబాసుపాలైన అనంతరం ఏపీ డీజీపీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారట. తను ఈ నెల 25, సోమవారం విశాఖ వెళ్లాలని అనుకుంటున్నట్టుగా, హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ఫ్లైట్ లో ప్రయాణించనున్నట్టుగా.. వైజాగ్ వెళ్లి అక్కడ నుంచి అమరావతి ప్రాంతానికి వెళ్లబోతున్నట్టుగా.. చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి సమాచారం ఇచ్చారట. ప్రస్తుతానికి రాష్ట్రాల వారీగా ప్రయాణాలకు కేంద్రం అందరికీ అనుమతులు ఇచ్చింది. అయితే ఆన్ లైన్ పర్మిషన్లు తెచ్చుకోవాలి. అలాగే కొన్ని రాష్ట్రాలు తప్పసరిగా హోం క్వారెంటైన్ పాటించాలని వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సామాన్య ప్రజలకు స్పష్టం చేస్తున్నాయి.
చంద్రబాబు నాయుడేమో తను డైరెక్టుగా వైజాగ్ వెళ్లిపోయి అక్కడ రాజకీయం చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. సామాన్యులేమో వేరే రాష్ట్రాల నుంచి వస్తేహోం క్వారెంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరి సామాన్యులకు ఒక న్యాయం చంద్రబాబుకు మరో న్యాయమా?