రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, ఓ మోస్తరు పెద్ద గ్రామాల్లో రోడ్ సైడ్ వ్యాపారం బాగా జరుగుతుండేది. రోడ్లను ఆక్రమించి షాపులు కట్టుకుని, అక్కడ్నుంచి తరలి వెళ్లమంటే మాత్రం నానా హంగామా చేసేవారు వ్యాపారులు. దీంతో రోడ్ల విస్తరణ, అధికారులకు తలకుమించిన పనిగా మారేది. మార్కెటింగ్ కాంప్లెక్స్ లు కట్టినా కూడా అవి నిరుపయోగంగా పడి ఉండటం చూశాం. రోడ్డు సైడ్ వ్యాపారాన్ని వదిలిపెట్టి ఎవరూ దుకాణాల సముదాయానికి వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. వినియోగదారులు ఎక్కడ చేజారిపోతారోననే భయం వారిది.
రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అలాంటి వారందరినీ కరోనా తరిమికొట్టింది. లాక్ డౌన్ సమయంలో ఇలాంటి వ్యాపారాలన్నీ నిర్బంధంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఒకవేళ వ్యాపారం చేయాలనుకుంటే ప్రభుత్వం సూచించిన మార్కెట్ ప్రాంగణంలోకి మారాల్సిన తప్పనిసరి పరిస్థితి. దీంతో చాలామంది ఇప్పటికే మార్కెట్ కాంప్లెక్సుల్లోకి మారి వ్యాపారం మొదలుపెట్టారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించే సమయానికి మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లో ఉన్న ఇలాంటి కాంప్లెక్సులన్నీ వ్యాపారులతో కళకళలాడుతున్నాయి. కూరగాయలు, మాంసం, పండ్లు, పూల వ్యాపారాలన్నీ ఒకే చోటకు చేరిపోయాయి.
ఒకప్పుడు అధికారులు హెచ్చరించినా రోడ్ సైడ్ వ్యాపారాలను వదిలిపెట్టనివారు, ఇప్పుడు కరోనా దెబ్బకి అందరూ ఒకే ప్రాంతానికి చేరారు. కరోనాతో వచ్చిన మరో పెద్దమార్పు సంచార దుకాణాలు. చిన్న ట్రాలీ ఆటో తీసుకోవడం, అందులో కూరగాయలు, పండ్లు పెట్టుకుని ప్రతి కాలనీకి వెళ్లి అమ్ముకోవడం వంటి కొత్త పద్ధతులు వచ్చాయి. ఒకరకంగా ఇది వినియోగదారులకు మేలు చేసేదే. గ్రామాల్లో, పట్టణాల్లో అనవసర రద్దీని నివారించేదే.
ఇక చిన్న స్థాయి పట్టణాల్లో ఉన్న దుకాణాలు కూడా ఇప్పుడు హోమ్ డెలివరీ ఆప్షన్ ఇస్తున్నాయి. వాట్సప్ లో ఆర్డర్ తీసుకోవడం, గూగుల్ పేలో డబ్బులు చెల్లించడం, ఇంటి వద్దే సరుకుల్ని తీసుకోవడం.. అందరికీ ఇది అలవాటవుతోంది. పెద్ద పెద్ద ఆన్ లైన్ సంస్థలకు ఆర్డర్ ఇస్తే సరకు డెలివరీ అయ్యే సరికి సమయం బాగా పడుతుంది. అలాంటిది ఊర్లో దుకాణానికి వాట్సప్ ఆర్డర్ ఇస్తే నిమిషాల వ్యవధిలో సరకులు ఇంటికి చేరుతున్నాయి.
మొత్తమ్మీద చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి గ్రామాల్లో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చేలా చేసింది కరోనా. అధికారులకు కూడా సాధ్యం కాని పనులన్నీ కరోనా చక్కబెట్టేసింది.