పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటలు ఆ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాయి. అంఫాన్ తుపాను బెంగాల్‌ను అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. ఒక వైపు కరోనా, మరో వైపు అంఫాన్ తుపాను ఆ రాష్ట్ర ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో మమతలో అసహనం పెరుగుతోంది.
అంఫాన్ తుఫాను సహాయ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజలు ఆగ్రహంతో నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతను ‘ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది కదా’.. అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మమత సీరి యస్‌గా స్పందిస్తూ… ‘అయితే నా తల నరకమనండి’ అని అసహనం వ్యక్తం చేశారు. అంఫాన్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకునేందుకు, పరిస్థితులను యథా స్థితికి తెచ్చేందుకు తాము రాత్రింబవళ్లూ పని చేస్తున్నామని మమత చెప్పారు.
అంఫాన్ తుపాను ధాటికి పశ్చిమబెంగాల్‌లో చాలా ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. చాలా చోట్ల కరెంట్ వైర్లపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కత్తా నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజులుగా ప్రజలు చీకట్లోనే మగ్గుతున్న ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. అంఫాన్ వల్ల పశ్చిమ బెంగాల్‌కు లక్ష కోట్ల నష్టం వాటిల్లిందంటే ఏ స్థాయిలో విధ్వంసం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు తనపై వస్తున్న విమర్శలపై ఆమె కాసింత అసహనానికి గురి అవుతున్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తుపాను విపత్తు నుంచి బయటపడేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.