అత్యాచారంపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాదు, బాలికపై అత్యాచారానికి పాల్పడి జైల్లో ఊచలు లెక్క పెడు తున్న నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసుల్లో గతంలో ఇలాంటి తీర్పులు రాకపోవడంతో పాటు జస్టిస్ పాణిగ్రహి వెల్లడించిన అభిప్రాయాలు కూడా చర్చనీయాంశమవు తున్నాయి.
ఒడిశాలో బాలికపై రేప్ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి కింది కోర్టులో బెయిల్ దక్కలేదు. దీంతో ఆ నిందితుడు ఒడిశా హైకోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం కిందికోర్టు ఆదేశాలను కొట్టి వేస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమె అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా భారతీయ శిక్షాస్మృతిలో లైంగిక దాడికి ఇచ్చిన నిర్వచనాన్ని జస్టిస్ పాణిగ్రహి గుర్తు చేశారు.
ఆమె అంగీకారం లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం, ఆమె అయిష్టతను పరిగణలోకి తీసుకోకుండా బలాత్కరించడం… ఇలా అనేక అంశాలు అత్యాచారం కిందికి వస్తాయని జస్టిస్ పాణిగ్రహి వెల్లడించారు. కావున నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఇస్తున్న తీర్పు విషయంలో న్యాయస్థానం స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆమె అంగీకారంతో శారీరక సంబంధం కొనసాగించడం అత్యాచారం కిందకు ఎంత మాత్రం రాదని ఒడిశా హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ తీర్పు న్యాయ వ్యవస్థతో పాటు పౌర సమాజంలో సరికొత్త చర్చకు దారి తీసింది.