“నాగబాబు అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. పార్టీతో ఆ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు.”
ఇలా పవన్ కల్యాణ్, నాగబాబు గురించి విడుదల చేసిన ప్రకటన వెనక నాదెండ్ల మనోహర్ హస్తం ఉందనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కల్యాణ్ ఇలాంటి వివాదంలో ప్రకటన చేయకుండా ఉండాల్సింది. “ఇది నా సెల్ఫ్ డబ్బా.. దీంతో మెగా ఫ్యామిలీకి కానీ, జనసేనకు కానీ సంబంధం లేద”ని ఆల్రెడీ నాగబాబు వివరణ ఇచ్చుకున్నాక మళ్లీ పవన్ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?
పవన్ ప్రెస్ నోట్ తో వివాదం సద్దుమణగకపోగా నాగబాబుపై జనసైనికుల్లో ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోయింది. స్వయానా పార్టీ అధ్యక్షుడే తన అన్నయ్య మాటలు పట్టించుకోవద్దని, ఆయన వ్యాఖ్యలకు జనసేనకు సంబంధం లేదని కుండబద్ధలు కొట్టిన తర్వాత ఇంకెవరూ నాగబాబుని పట్టించుకోరు. ఈ విషయం తెలిసి కూడా పవన్ తన అన్నయ్యకు అడ్డుకట్ట వేయాల్సి వచ్చింది, నాదెండ్ల సలహా తోటే ఈ ప్రెస్ నోట్ తయారైందని, ఆయన ప్రోద్బలంతోనే అయిష్టంగా తన అన్నయ్యకు పవన్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని జనసేన వర్గాల సమాచారం.
పవన్ పై ఎవరు, ఎప్పుడు కాసింత నోరుజారినా తన-మన అని చూడకుండా విరుచుకుపడిపోయేవారు నాగబాబు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా పవన్ ని నాగబాబు సపోర్ట్ చేసినంతగా మెగా కాంపౌండ్ నుంచి ఇంకెవరూ వెనకేసుకు రాలేదు. అలాంటి నాగబాబునే ఇప్పుడు పవన్ సైడ్ చేసినట్టు మాట్లాడటం పార్టీలోనూ, మెగా ఫ్యామిలీలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.
నాగబాబు అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు అని పవన్ స్టేట్ మెంట్ ఇస్తే అదో రకం, కానీ ఏకంగా ఆయన మాటలు పట్టించుకోవద్దు, వాటికీ జనసేనకూ సంబంధం లేదని చెప్పేస్తే ఇక నాగబాబుకి పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో విలువ ఏముంటుంది? అందుకే పగడ్బందీగా నాదెండ్ల ఇలాంటి స్కెచ్ వేశారని, జనసేనలో పవన్ తర్వాత తన స్థానాన్ని సుస్థిర పరచుకుంటున్నారని పార్టీలో నాదెండ్ల వ్యతిరేక వర్గాలంటున్నాయి.
నిజానికి ఇది నాగబాబుపై క్రమశిక్షణరాహిత్యం కింద పార్టీ చర్యలు తీసుకోవాల్సిన సమయం. తన సొంత ప్రయోజనం కోసం నాదెండ్ల, పవన్ తో ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారని అనుకున్నప్పటికీ… పార్టీ నుంచి నాగబాబు విషయంలో అంతకుమించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే జనసేనలో పారదర్శకత అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.