కోట్ల రూపాయలు మీకు.. బేడీలు మాకా..?

అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఏరికోరి తెచ్చుకున్న చంద్రబాబు.. ఉద్యమం కోసం వెళ్తున్న మనుషుల్ని ఆపడానికి మాత్రం దళితుల్ని ఎందుకు అడ్డం పెట్టారని ప్రశ్నించారు బాపట్ల…

అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఏరికోరి తెచ్చుకున్న చంద్రబాబు.. ఉద్యమం కోసం వెళ్తున్న మనుషుల్ని ఆపడానికి మాత్రం దళితుల్ని ఎందుకు అడ్డం పెట్టారని ప్రశ్నించారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. 

కోట్లు మీకు, బేడీలు మాకా అని సూటిగా అడిగారు. దళితుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. రాజధాని రైతులకు బేడీలు వేసిన విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, కొందరు అధికారుల్ని సస్పెండ్ చేశామని చెప్పారు ఎంపీ సురేష్. 

గతంలో టీడీపీ హయాంలో అసైన్డ్ భూముల రైతులు నష్టపరిహారం కోసం రోడ్లెక్కితే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు సురేష్. అప్పుడు అరెస్టైన వారిలో తాను కూడా ఉన్నానని, తాను కూడా ఓ దళితుడిననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు దళిత రైతుల్ని పరామర్శించడానికి టీడీపీ నేతలు ఎందుకు రాలేదని నిలదీశారు.

ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా తనపై అనేకసార్లు అమరావతిలో దాడులు జరిగాయని, ఇంటికి వచ్చి మరీ ఓ టీడీపీ కార్యకర్త తనపై రాడ్డుతో దాడి చేయబోయారని అన్నారు సురేష్.. అమరావతిలో దళితుల ఉద్యమాన్ని అడ్డుకోబోయినవారు, ఆటోలలో వెళ్తున్న ఉద్యమకారుల్ని అడ్డుకున్న వారు ఏ వర్గానికి చెందినవారైనా తప్పుచేసినట్టే లెక్క అని చెప్పారు. అక్కడ దళితులు తప్పు చేశారనేకంటే.. చంద్రబాబు దళితుల్ని ప్రేరేపించారని చెప్పడం సబబు అని అన్నారు ఎంపీ సురేష్.

ఆటోల్లో వెళ్తున్నవారిని అడ్డుకున్న సందర్భంలో అక్కడ అగ్ర కులాలకు చెందినవారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారని.. వారంతా వెనక ఉండి కేవలం దళితుల్ని మాత్రమే ఉసిగొల్పారని చెప్పారు. అక్కడ ఉన్నవారు ఎలాంటి బూతులు మాట్లాడారో చెప్పే వీడియోలు తన వద్ద ఉన్నాయని అన్నారు.

దళిత రైతులంటూ కన్నీరు కారుస్తున్న చంద్రబాబు.. బషీర్ బాగ్ లో రైతుల వీపుపై విరిగిన లాఠీలకు, పేలిన తూటాలకు లెక్క చెప్పగలరా అని ప్రశ్నించారు. కోట్లు వెనకేసుకోడానికి మీ సామాజిక వర్గం వారు కావాలి, బేడీలు వేయించుకోడానికి మాత్రం మేం కావాలా అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సురేష్.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం